ముఖ్యాంశాలు

  • పిటిషన్లను కొట్టివేసిన న్యాయస్థానం

నిర్భయ దోషులు క్షమాభిక్ష, క్యురేటివ్ పిటిషన్లు వేసుకునేందుకు అవసరమయ్యే పత్రాలను తీహాడ్ జైలు అధికారులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ..దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ శుక్రవారం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన ఢిల్లీ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి అజయ్ కుమార్ జైన్ పిటిషన్ ను కొట్టివేశారు. నిందితుల్లో ఒకడైన వినయ్ కు సంబంధించిన డైరీ, పెయింటింగ్స్ ను తీహార్ జైలు అధికారులు తనకు ఇవ్వలేదని దోషుల తరపు న్యాయవాది ఆరోపించగా…పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ వాదనలను తోసిపుచ్చారు. దోషుల తరపు న్యాయవాదికి అవరసమైన అన్ని పత్రాలను తీహార్ జైలు అధికారులు న్యాయస్థానానికి అందజేసినట్లు ఆయన న్యాయస్థానానికి తెలిపారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు వారు ఇలాంటి పిటిషన్లను వేసి సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్.

అయితే ముందుగా దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్..వినయ్ శర్మపై తీహార్ జైలులో విష ప్రయోగం జరిగిందని, అందుకే అతడిని ఆస్పత్రిలో చేర్పించారని వాదించారు. కానీ వినయ్ కు సంబంధించిన ఎలాంటి మెడికల్ రిపోర్టులను అధికారులు ఇవ్వలేదని, అవి ఉంటే వినయ్ క్షమాభిక్ష పెట్టుకునేందుకు ఉపయోగపడతాయన్నారు. వినయ్ మానసిక పరిస్థితి బాగోలేదని, అతను సరిగ్గా ఆహారం కూడా తీసుకోవడం లేదని ఏపీ సింగ్ ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు..పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించింది. ఏపీ సింగ్ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.