నిమ్మగడ్డ రమేష్‌కుమార్ లేఖపై సీఐడీకి అందిన ఫోరెన్సిక్ నివేదిక
By సుభాష్ Published on 5 May 2020 3:39 PM ISTఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం రోజురోజుకు వేడెక్కుతోంది. ఆయనను తొలగించడం రాజకీయ దుమారం రేపుతోంది. అయితే రమేష్ కుమార్ లేఖకు సంబంధించి వాస్తవాలు ఒక్కోక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ లేఖకు సంబంధించిన పలు వాస్తవాలను సీఐడీ అధికారులు అనేక కీలక అంశాలను రాబట్టారు. ఈ లేఖ వ్యవహారంపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేపడుతోంది.
ఇక తాజాగా ఆ లేఖ ఎస్‌ఈసీ కార్యాలయం నుంచి రాలేదని నిర్ధారించారు. ల్యాప్‌టాప్, డెస్క్ టాప్‌లను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు సీఐడీ అధికారుల చేతికి ఫోరెన్సిక్ నివేదిక అందింది. దీనికి సంబంధించిన సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. రమేష్ కుమార్ పీఏ సాంబమూర్తి అన్ని అబద్దాలే చెప్పారని, ఆ లేఖను ముందుగానే తయారు చేశారని, అది బయటి నుంచి వచ్చిందని తెలిపారు. మార్చి 18వ తేదీన ఉదయం పెన్ డ్రైవ్ ద్వారా రమేష్ కుమార్ వద్దకు చేరిందని చెప్పారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో త్వరలోనే తేలుస్తామని స్పష్టం చేశారు.
కాగా, రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖపై ముందు నుంచి ఎన్నో అనుమానాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతోనే ఈ లేఖ టీడీపీ కార్యాలయంలో తయారైందని, ఆ లేఖలో ఉన్న పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లని ఆరోపణలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను రమేష్ లేఖపై విచారణ చేపట్టాలని కోరిన విషయం తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ జారీ సందర్భంగా రమేష్ కుమార్ చేసిన సంతకానికి, కేంద్ర హోంశాఖకు అందిన లేఖలో ఉన్న సంతకానికి ఎలాంటి పొంతన లేదని విజయసాయిరెడ్డి తెలిపారు.