ఎవ‌రీ నిఖ‌త్ జ‌రీన్‌.. ఏంటా ధైర్యం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Dec 2019 11:30 AM GMT
ఎవ‌రీ నిఖ‌త్ జ‌రీన్‌.. ఏంటా ధైర్యం..!

ఎవ‌రీ నిఖ‌త్ జ‌రీన్‌.. గ‌త రెండుమూడు రోజుల‌గా మారుమోగిపోతుంది ఈ పేరు. పేప‌ర్ల‌లో, టీవీల‌లో, సోష‌ల్ మీడియాలో ఏ నోట విన్నా.. ఏ మాట విన్నా.. త‌న గురించే.. అస‌లు ఆమె ఎవ‌రు.. ఏంటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం. నిజామాబాద్‌లోని మారుమూల ఓ ప్రాంతానికి చెందిన అమ్మాయి.. బాక్సింగ్ పై ఇష్టం పెంచుకొంది. అప్పటికే తన సత్తాను చాటి.. గెలుపు రుచిని ప్రపంచానికి చూపించిన మేరీకోమ్‌ను ఆదర్శంగా తీసుకొంది.

Image result for nikhat zareen

అయితే.. బాక్సింగ్ నేర్చుకోవడానికి సరైన సౌకర్యాలు అందుబాటులో లేకపోయినా క‌సితో సాధ‌న చేసింది. ప్ర‌త్య‌ర్థులకు తన పంచ్ పవర్‌ను చూపించి పతకాలు సాధించింది. తెలంగాణా మేరీకోమ్ గా పేరు తెచ్చుకుంది. ప్రత్యర్ధి ఎవరైనా సరే తన బలంతో మ‌ట్టిక‌రిపించి పతకాలు సాధిస్తూ ముందుకు సాగిపోతోంది. కొద్దిగా ప్రోత్సాహం ఇస్తే చాలు అమ్మాయిలు ఏదైనా సాధించగలరని నిఖత్ నిరూపించింది.

అయితే.. ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ కోసం నిఖత్ జరీన్... మేరీ కోమ్ తో ట్రయల్స్ నిర్వహించాలని భారత బాక్సింగ్ సమాఖ్యను కోరింది. కాగా బాక్సింగ్ ఫెడ‌రేష‌న్ ఆప్ ఇండియా అనేక ఒత్తిడుల మధ్య వీరిద్ద‌రి మ‌ధ్య పోరును ప్రకటించించింది. అయితే.. వీరిద్దరి మధ్య వివాదం ఒలింపిక్స్‌లో కొన్ని విభాగాలను తీసివేయ‌డంతో ప్రారంభమైంది.

Image result for nikhat zareen

అంత‌కుముందు ఒలంపిక్స్ లో 48 కేజీల విభాగంలో మేరీకోమ్ ప్రాతినిథ్యం వహించేది. నిఖత్ జ‌రీన్ 51 కిలోల కేటగిరీలో ఆడేది. అయితే.. టోక్యో ఒలింపిక్స్‌లో 48 కేజీల విభాగం ఎత్తివేయడంతో.. మేరీకోమ్ 51 కేజీల కేటగిరీకి మారింది. గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎలాంటి ట్రయల్స్ నిర్వహించకుండా మేరీకోమ్‌ను ఒలింపిక్ ట్రయల్స్‌కు పంపుతామని బీఎఫ్ఐ చీఫ్ ప్రకటించడంతో వీరిద్ద‌రి మ‌ధ్య‌ వివాదం మొద‌లైంది.

నిఖ‌త్.. త‌న‌కు ఫెయిర్ చాన్స్ కావాలని, మేరీకోమ్‌కు, నాకు ట్రయల్ మ్యాచ్‌ నిర్వహించి క్వాలిఫయర్స్‌కు పంపాలని కేంద్రానికి లేఖ రాసింది. నిఖ‌త్ నిర్ణ‌యం ప‌ట్ల‌ అన్నివైపుల నుంచి అనూహ్యంగా మద్దతు లభించడంతో బీఎఫ్ఐ ట్రయల్స్‌కు అంగీకరించింది. దీనికి మేరీకోమ్ కూడా ట్రయల్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది.

Image result for nikhat zareen

అయితే.. శుక్రవారం నిర్వహించిన ట్రయల్స్‌లో జ్యోతి గులియాను ఓడించి నిఖత్ జ‌రీన్.. రీతూ గ్రేవాల్‌ను చిత్తుచేసి మేరీకోమ్ ఫైనల్‌కు చేరారు. ఈ నేఫ‌థ్యంలో బ‌రిలోకి దిగిన‌ మేరీకోమ్, యువబాక్సర్ నిఖత్ జరీన్ ను 9-1తో ఓడించింది. అయితే మ్యాచ్ అనంత‌రం తనను ఆలింగనం చేసుకోడానికి ప్రయత్నించిన నిఖత్ జరీన్‌ను.. మేరీ కోమ్ పక్కకు నెట్టడం ద్వారా దురుసుగా ప్రవర్తించింది. దీంతో మేరీకోమ్ క్రీడాస్పూర్తి లేకుండా ప్ర‌వ‌ర్తించిందంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఏదిఏమైనా.. ఎనిమిదిసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన‌ తనను.. నిఖత్ జరీన్ సవాలు చేయటాన్ని మేరీకోమ్ ఏమాత్రం భరించలేకపోయిందన్నది ముమ్మాటికీ వాస్తవం.

ఇక‌, ఎవరో ఏదో అనుకొంటారని ఎప్పుడూ మీ ఇష్టాలను నెరవేర్చుకొనేందుకు వెనకడుగు వేయొద్దని నిఖ‌త్ జ‌రీన్ అంటోంది. నేను బాక్సింగ్ చేస్తానని చెప్పినప్పుడు మా నాన్న ఒక్క‌రే ఎంకరేజ్ చేశార‌ని పేర్కోంది. మా నాన్న దగ్గరి నుండి కూడా నాకు ఆ ప్రోత్సాహం రాక‌పోతే.. నేను ఈ స్థాయికి చేరుకొని ఉండేదాన్ని కాదని అంటోంది.

Related image

బాక్సింగ్ అంటే మగపిల్లల ఆట.. అది నీకెందుకు? అని నన్ను ఆపడానికి చాలామంది ప్ర‌య‌త్నించార‌ని నిఖ‌త్ పేర్కొంది. నాకే కాదు ఏ అమ్మాయికైనా ఇలాగే జరుగుతుంది. మనం వాటిని పట్టించుకొంటే.. అక్కడే ఉంటాం. ఏం చేయాలి అనే నిర్ణయం మనదైతేనే మ‌నం విజయం సాధించగలమ‌ని పేర్కొంది. ఇక‌.. స‌క్సెస్ వ‌చ్చిన తర్వాత ఎవరైనా అందలం ఎక్కిస్తారు. కానీ ముందుగానే మ‌న‌లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ఈ బాక్సింగ్ స్టార్ అంటోంది.

Next Story
Share it