• భారత్ లో పెళ్లి చేసుకుంటే భాగస్వామికి విజిట్ వీసా
  • పెళ్లి జరిగినట్టు బలమైన ఆధారాలు చూపడం అవసరం
  • కుటుంబ సభ్యుల లేఖలు, ప్రమాణ పత్రాలు పనికిరావు
  • రిజిస్టర్డ్ పత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకునే అధికారులు
  • ఇతర దేశాల్లో పెళ్లిళ్లు జరిగితే విజిట్ వీసాకు అనుమతి లేదు
  • కేవలం భారత్ లో పెళ్లి జరిగితే మాత్రమే అర్ధాంగికి విజిట్ వీసా

రమన్ సింగ్ అత్యంత ప్రతిభాశాలి. ఇట్టే ఎలాంటి ఇబ్బందినైనా అధిగమించగలడు. జనవరిలో పెళ్లికూడా అయ్యింది. కానీ భార్యను తనతోపాటుగా తీసుకెళ్లడానికి న్యూజిల్యాండ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. కారణం ఏమిటంటే రమన్ సింగ్ పెళ్లి న్యూజిల్యాండ్ లో జరగలేదు. ఇండియాలో జరిగింది. ఇరవై ఏడు సంవత్సరాల వయసున్న రమన్ సింగ్ మాత్రం చిన్నప్పుడే తల్లిదండ్రులతో కలసి న్యూజిల్యాండ్ కి వెళ్లిపోయాడు. ఇప్పుడు వాళ్ల ముగ్గురికీ న్యూజిల్యాండ్ పౌరసత్వం ఉంది. ఎంత పరాయి దేశానికి వెళ్లినా కోడల్ని మాత్రం స్వదేశం నుంచే తెచ్చుకోవాలన్నది సింగ్ తలిదండ్రుల ఆకాంక్ష. సింగ్ కూడా దానికి ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు. పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. కానీ ఆ తర్వాతే అసలు కష్టం మొదలయ్యింది. భర్తతోపాటుగా భార్యకూడా న్యూజిల్యాండ్ వెళ్లేందుకు అనుమతి లేదు. ఇది కేవలం ఒక్క రమన్ సింగ్ ఇబ్బంది మాత్రమే కాదు. గడచిన మే నెలనుంచి నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో దాదాపుగా 12,000కు పైగా విజిట్ వీసాలకు న్యూజిల్యాండ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

ఇలా పదే పదే చాలామందికి ఇబ్బంది కలుగుతూ ఉండడంతో న్యూజిల్యాండ్ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని ఇమ్మిగ్రేషన్ నిబంధనలను సడలించింది. భారత్ లో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్న జంటలను పూర్తిగా దేశంలోకి ఆహ్వానించేందుకు అనుమతిని కల్పిస్తూ ఎంబసీ అధికారులు నియమనిబంధనలను సడలించి కొత్త నిబంధనలను ఖరారు చేశారు. కానీ భారత్ లో తప్ప మరే ఇతర దేశాల్లో పెళ్లి కుదుర్చుకున్న వాళ్లకు ఈ నిబంధనలు వర్తించవు. కేవలం భారత్ లో ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకున్నవాళ్లకు మాత్రమే పూర్తి స్థాయిలో ఈ సడలింపు వర్తిస్తుందని న్యూజిల్యాండ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. అదిమాత్రమే కాక కలిసి బతకడం లాంటి కేసుల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఈ నిబంధనలు కఠినతరంగా ఉంటాయి. తాజా సడలింపులు లివింగ్ టు గెదర్ కి ఏమాత్రం వర్తించడానికి వీల్లేదని న్యూజిల్యాండ్ ప్రభుత్వం నిర్ణయించింది.

రమన్ సింగ్ కి తన భార్యకు జనరల్ విజిటర్ వీసాను అప్లై చేయాలని ఇమ్మిగ్రేషన్ అధికారులు సూచించారు. నిబంధనల సడలింపునకు ముందే సింగ్ వివాహం పూర్తైపోయినందున, అప్పటికే సింగ్ భార్యను తనతోపాటుగా న్యూజిల్యాండ్ తీసుకెళ్లేందుకు దరఖాస్తు పెట్టుకున్నందుకు ప్రస్తుతం చట్టంలో చేసిన మార్పులు చేర్పులు దానికి వర్తించవని అధికారులు చెబుతున్నారు. ఆ కారణంగానే సాధారణ విజిటర్ వీసాకోసం దరఖాస్తు చేసుకోమని కోరినట్టుగా తెలిపారు. వీసాకోసం అప్లైచేసుకున్నవాళ్లు మళ్లీ తిరిగి వాళ్ల దేశానికి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారా లేరా అన్న విషయాన్ని అధికారులు పట్టిపట్టి మరీ చూస్తారు. లేదంటే విజిట్ వీసామీద తమ దేశంలోకి వచ్చి ఏదో ఒక రూపంలో పి.ఆర్.కు దరకాస్తు చేసుకుని అక్కడే స్థిరపడిపోయేందుకు ప్రయత్నిస్తారు. ఆ తర్వాత న్యూజిల్యాండ్ నుంచి అమెరికా లాంటి అగ్రరాజ్యాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది ప్రయత్నిస్తూ ఉంటారని న్యూజిల్యాండ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు భావిస్తూ ఉంటారు. ఆ కారణంగా నిజంగా భర్తతో కలసి జీవించాల్సిన భార్యలకు కూడా వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దరఖాస్తు చేసుకున్నవారికి ఖచ్చితంగా వివాహం జరిగినట్టుగా బలమైన సాక్ష్యాధారాలను, రిజిస్ట్రేషన్ పత్రాలను వీసాకోసం అప్లై చేసుకునే వాళ్లు ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. నేటి వరకూ వీసా నిబంధనలను ఉల్లఘించిన కారణంగా దాదాపు 800 మందికి శిక్షలు పడ్డాయి. వీళ్లందరూ మళ్లీ తాజాగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.