ఇపుడు యువరాజ్‌ సింగ్‌ మనతో ఉన్నారు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Aug 2020 4:15 PM GMT
ఇపుడు యువరాజ్‌ సింగ్‌ మనతో ఉన్నారు..!

మహేంద్ర సింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్టు ప్రకటించిన వార్త దేశంలో సంచలనంగా మారింది. దోనీని విపరీతంగా ప్రేమించే అభిమానులు ఈ విషయాన్ని తట్టుకోలేకపోయారు. దోనీ ప్రకటనానంతరం మీడియా కుప్పలు తెప్పలుగా వార్తలు వార్తా కథనాలు ప్రచురించింది. ప్రింట్‌ మీడియాలో దోనీ క్రికెట్‌ విజయాలు.. అతని క్రీడా జీవితంపై పెద్ద పెద్ద వార్తాకథనాలు రాశాయి. అలాగే ఎలక్ట్రానిక్‌ మీడియాలో దృశ్యరూపకంగా దోనీ క్రికెట్‌ జీవితాన్ని చూపించారు.

పాఠకుల, ప్రేక్షకుల మనసుల్ని ఆకట్టుకునే ఇలాంటి సందర్భాలు మీడియాకు అరుదుగా వస్తుంటాయి. ఆ సమయంలో విపరీతమైన పోటీ కూడా ఉంటుంది. ఎవరు ముందు స్టోరీ ఇచ్చారు అనేదే కాదు.. ఎవరు ఎక్స్‌క్లూజివ్‌ పిక్‌లు.. ఇన్‌ఫర్మేషన్‌.. ఇంటర్వ్యూలు ఇచ్చారన్నది కూడా టీఆర్‌పీ రేటింగ్‌కు ప్రధానమవుతాయి. అయితే ఈ పరుగులో అత్యంత అప్రమత్తంగా ఉండకపోతే అభాసుపాలు కావడం ఖాయం. తాజాగా ఓ న్యూస్‌ చానెల్‌ అలాంటి తప్పే చేయడంతో నెటిజన్లు ఓ ఆట ఆడేసుకున్నారు.

ధోనీ రిటైర్‌మెంట్‌ ప్రకటనపై సాటి క్రీడాకారుల స్పందన ఎలా ఉంటుందనేది చాలా కుతూహలంగా ఉంటుంది. అదే సమయంలో వారు ధోనీతో తమకున్న అనుభవాలు పంచుకోవడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పాపం ఓ న్యూస్‌ చానెల్‌ ఇలాంటి ఓ కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రోగ్రామ్‌ లైవ్‌లో ఉన్నప్పుడు సాటి క్రీడాకారుడు యువరాజ్‌ సింగ్‌కు కాల్‌ చేసింది. న్యూస్‌ ప్రెజెంటర్‌ ‘యువరాజ్‌ సింగ్‌ భాయ్‌ ఇపుడు మనతో కాల్‌లో ఉన్నారు. ఇది చాలా ఉద్విగ్నత కలిగించే క్షణం. క్రికెట్‌ దిగ్గజం ధోనీ తన రిటైర్‌మెంట్‌ ప్రకటించడాన్ని ప్రియ క్రికెట్‌ అభిమానులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు.

ఆయన టీమ్‌లో యువరాజ్‌ ఆడారు. ధోనీ కేప్టెన్సీ ఎలా ఉండేది? ఆయనతో మీ అనుబంధం ఏంటి ? తెలుసుకుందామా.. యువరాజ్‌సింగ్‌ భయ్యా ధోనీ రిటైర్‌మెంట్‌ నిర్ణయంపై మీ స్పందన ఏంటి? అసలు ఇపుడు మీ మనసులో తలెత్తుతున్న భావాలేంటి? తెలపండి ’ అని అడిగారు. ఓ క్షణం నిశ్శబ్దం. ఆ తర్వాత అటువైపు నుంచి ఓ గొంతుక వినిపించింది.. ‘ సార్‌.. నేను యువరాజ్‌ సింగ్‌ను కాను.. బహుశా మీరు రాంగ్‌ కాల్‌ చేసినట్టున్నారు. ఇప్పుడు మీ టీఆర్పీకేం ఇబ్బంది రాదు కదా..’ అంటూ అమాయకంగా అడిగాడు. ఒక్కసారిగా చానెల్‌లో బాంబు పేలినట్టయింది. సీన్‌ కట్‌ చేస్తే.. ఈ వీడియో క్లిపింగ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. అందరూ న్యూస్‌ చానెల్‌ను తెగ ఆడేసుకున్నారు.

అయితే ఈ తతంగం ఇంతటితో ఆగలేదు. ఆరోజు చానెల్‌లో మాట్లాడిన ఆ వ్యక్తి పోనీలే అని ఊరుకోక ఈ విషయాన్ని ‘ నిన్న రాత్రి నాకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది.. నన్ను యువరాజ్‌ సింగ్‌ అని పొరబడ్డారని అర్థమైంది. ఇదీ ఆ న్యూస్‌ చానెల్‌ పరిస్థితి’ అంటూ ట్వీటాడు. ఇదికూడా నిప్పుకు గాలిలా అంటుకుని వైరల్‌ అయింది. నెటిజన్లు ఆ ఆగంతకుణ్ణి భలే చెప్పాడే అంటూ మెచ్చుకుంటూ ట్వీట్‌ల వర్షం కురిపించారు.

Next Story