ముఖ్యాంశాలు

  • పాత మాగ్నటిక్ ఏటీఎం కార్డులు రద్దు
  • కొత్త ఐ.ఎమ్.వి చిప్ కార్డులు తప్పనిసరి
  • ఎస్.బి.ఐ ఎ.టి.ఎం విత్ డ్రాల్స్ కు రాత్రిళ్లు ఓటీపీ
  • నాన్ ఎస్.బి.ఐ ఏటీఎమ్ కి ఓటీపీ అఖ్కర్లేదు
  • ఆర్థిక సంవత్సరాంతంలో ఐటీ రిటర్న్స్ దాఖలు
  • ప్రతి రిటర్న్ పై రూ.10,000 పెనాల్టీ ఫీజు
  • ఫెయిల్డ్ ట్రాన్సక్షన్లపై కఠిన నిబంధనలు
  • సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లకు నెఫ్ట్ చార్జీల తొలగింపు
  • 6 రోజుల్లో రివర్స్ ఎంట్రీ పడాలని నిబంధన
  • లేదంటే రోజుకు రూ.100 పరిహారం

కొత్త సంవత్సరంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నిబంధనలు మారిపోయాయి. డెబిట్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎంలనుంచి డబ్బుతీసుకోవడం లాంటి లావాదేవీలకు సంబంధించి పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ రూల్స్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. జనవరి ఒకటో తేదీనుంచి పాత మాగ్నటిక్ డెబిట్ కార్డులు పనిచెయ్యడం ఆగిపోయాయి.

వాటి స్థానంలో తప్పనిసరిగా నియోగదారులందరూ కొత్త ఇ.ఎమ్.వి చిప్ కార్డులను పొందాల్సి ఉంటుంది. ఈ కార్డు పూర్తిగా ఉచితం. ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన పనిలేదు. బ్యాంకులన్నీ పూర్తిగా పాత మాగ్నటిక్ కార్డుల్ని కొత్త ఇ.ఎమ్.వి కార్డులుగా మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఇండియా సూచనలు జారీచేసింది.

కొత్త ఇ.ఎమ్.వి కార్డులతో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మోసం జరగడానికి ఆస్కారం ఉండదు. లావాదేవీ జరిగిన ప్రతిసారీ ఆ కార్డులు డైనమిక్ డేటాని క్రియేట్ చేస్తాయి. పైగా ఈ కార్డుల్ని క్లోన్ చేయడం సాధ్యంకానిపని. రాత్రివేళల్లో ఎస్.బి.ఐ ఎటిఎమ్ లనుంచి డబ్బులు తీసుకోవాలంటే తప్పనిసరిగా ఒన్ టైమ్ పాస్ వర్డ్ అవసరమవుతుంది. మోసాలను నిరోధించేందుకే ఎస్.బి.ఐ ఈ నిర్ణయం తీసుకుంది.

రూ. 10,000 కంటే ఎక్కువ ఏటీఎం విత్ డ్రాల్స్ కు ఓటీపీ తప్పనిసరి. నాన్ ఎస్బీఐ ఏటీఎం అయితే ఓటీపీతో పనిలేదు.

నిజానికి ఇప్పుడు అన్ని బ్యాంక్ ల చిప్ కార్డులకూ లావాదేవీ జరిపినప్పుడల్లా రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ కు తప్పనిసరిగా ఒన్ టైమ్ పాస్ వర్డ్ వస్తోంది. దానివల్ల కార్డు ఎక్కడైనా పడిపోయినా, పిన్ నెంబర్ లేదా సివివి నెంబర్ ఎవరికైనా తెలిసినా అనధికారికంగా లావాదేవీ జరపడానికి వీలుకాదు.

ఇన్ కం టాక్స్ రిటర్న్ దాఖలు

ఒకవేళ ఆగస్ట్ 31లోగా మీరు ఇన్ కం టాక్స్ రిటర్న్ దాఖలు చేయకపోయినట్టైతే ఆర్థిక సంవత్సరం చివర్లో దాఖలు చేసే అవకాశం ఉంది. కానీ జనవరి 1 తర్వాత దాఖలు చేసే ప్రతి ఒక్క ఇన్ కం టాక్స్ రిటర్న్ కీ రూ.10,000 పెనాల్టీ ఫీజు విధింపబడుతుంది. నెఫ్ట్ చార్జీలను పూర్తిగా రద్దయ్యాయి. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ కి జనవరి ఒకటో తారీఖునుంచీ అన్ని బ్యాంకుల్లోనూ నెఫ్ట్ చార్జీలు లేవు.

ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్లకు సంబంధించికూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు విధించింది. ఒకవేళ మీరు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు డబ్బులు బైటికి రాకుండా మీ అకౌంట్ డెబిట్ అయితే, నిర్ణీత కాలవ్యవధిలోగా తిరిగి ఆ నగదు మీ ఖాతాకు క్రెడిట్ కాకపోతే కచ్చితంగా బ్యాంకు నష్టపరిహారం చెల్లించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన విధించింది. లావాదేవీ జరిగిన తేదీతో కలిపి ఆరు రోజుల్లోగా నగదు తిరిగి ఖాతాదారు ఖాతాకు జమ కాకపోతే రోజుకు రూ.100 చొప్పున బ్యాంక్ పరిహారం చెల్లించాలి.

కార్డ్ టూ కార్డ్ మనీ ట్రాన్సఫర్ విషయంలో అయితే ట్రాన్సాక్షన్ జరిగిన రోజుతోపాటుగా మరో ఇరవై నాలుగు గంటల సమయం మాత్రం ఉంటుంది. ఈ కాల వ్యవధి దాటితే బ్యాంక్ రోజుకు రూ. 100 పరిహారం ఖాతాదారుకు చెల్లించాలి. ఆటోరివర్సల్ ఫెసిలిటీ లేని తక్కువ నాణ్యత కలిగిన ఏటీఎంలను నియంత్రించేందుకే ఆర్బీఐ ఈ రూల్ పెట్టిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

పాయింట్ ఆఫ్ సేల్స్ దగ్గర డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లకు, క్యాష్ ఎట్ పీఓఎస్ లకుకూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఖాతాదారు అకౌంట్ కు నగదు డెబిట్ అయ్యి, స్లిప్ రానప్పుడు, మర్చండైజ్ అకౌంట్ కు నగదు జమకానప్పుడు లావాదేవీ జరిగిన రోజుతో కలిపి ఆరు రోజుల్లోగా డెబిట్ అయిన నగదు తిరిగి ఖాతాదారు అకౌంట్ కు జమకావాలి. లేని పక్షంలో బ్యాంకులు రోజుకు రూ.100 చొప్పున ఖాతాదారుకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

కార్డ్ నాట్ ప్రెజెంట్ ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్లకు, ఈ కామర్స్ ట్రాన్సాక్షన్లకు కూడా ఇవే రూల్స్ వర్తిస్తాయి. అదే విధంగా ఐ.ఎమ్.పి.ఎస్ ట్రాన్సాక్షన్లలో అకౌంట్ డెబిట్ అయ్యి, బెనిఫిషియరీ అకౌంట్ కు క్రెడిట్ కానప్పుడు బ్యాంక్ కచ్చితంగా రెండు రోజుల్లోగా ఆటోరివర్సల్ ఎంట్రీని వేసి తీరాలి. లేదంటే రోజుకు రూ.100 చొప్పున పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్