క్రికెట్‌లోకి కొత్త రూల్‌.. టీమిండియా-విండీస్ సిరీస్ నుండే అమ‌ల్లోకి..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Dec 2019 1:52 PM GMT
క్రికెట్‌లోకి కొత్త రూల్‌.. టీమిండియా-విండీస్ సిరీస్ నుండే అమ‌ల్లోకి..

కొద్ది రోజులుగా ఫీల్డ్‌ అంపైర్లు నో బాల్స్‌ను గుర్తించడంలో పదేపదే విఫ‌ల‌మ‌వుతున్నారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్న‌ నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బౌల‌ర్‌ ఫ్రంట్ ఫుట్ నోబాల్స్‌ను గుర్తించే బాధ్యతను కూడా థర్డ్‌ అంపైర్‌కే అప్పగిస్తున్నట్లు ఐసీసీ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది.

అయితే.. టీమిండియా-విండీస్ మధ్య జరిగే టీ20, వన్డే సిరీస్‌​లలో ఈ నిబంద‌న‌ను అమ‌లుచేయ‌నున్న‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా ఈ సిరీస్‌తో పాటు, మ‌రికొన్ని సిరీస్‌ల‌లో కూడా ఈ నిబంధనను పరిశీలించి తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని అమ‌లు చేయాలని ఐసీసీ భావిస్తుంది.

ఇక‌పై ఈ నిబంధన ప్రకారం థర్డ్‌ అంపైర్ బౌల‌ర్ వేసే ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్స్‌ను గుర్తించి ఫీల్డ్‌ అంపైర్‌కు సూచిస్తాడు. అదేవిధంగా థర్డ్‌అంపైర్‌తో చర్చించకుండా ఫీల్డ్‌ అంపైర్‌ నోబాల్స్‌ను ప్రకటించకూడదు. ఒక వేళ బ్యాట్స్‌మన్‌ ఔటైన బంతి నోబాల్‌ అని థర్డ్‌ అంపైర్‌ ప్రకటిస్తే ఫీల్డ్‌ అంపైర్ త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాలి. ఈ కొత్త నిబంద‌న‌ మినహా ఫీల్డ్‌ అంపైర్‌కు ఉండే విధులు, బాధ్యతలు అలాగే ఉంటాయ‌ని ఐసీసీ ఉన్నతాధికారి ఒక‌రు తెలిపారు.

Next Story
Share it