తెలంగాణ రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌

By సుభాష్  Published on  9 Sep 2020 7:44 AM GMT
తెలంగాణ రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రైతులకు శుభవార్త వినిపించారు. ఇక నుంచి భూ సంస్కరణల కోసం ఎవ్వరూ కూడా కార్యాలయాల చుట్టు తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చారు. బుధవారం బిల్లును ప్రవేశపెట్టిన కేసీఆర్‌.. కొత్త చట్టం వివరాలను వెల్లడించారు. ఈ చట్టం ప్రకారం తెలంగాణలోని ప్రస్తుతం ఇంచు భూమిని సర్వే చేయిస్తామని, ప్రతి సర్వే నెంబర్‌కు కోఆర్డినేట్స్‌ ఏర్పాటు చేస్తామని, ప్రతి భూమికి ఆక్షాంశాలు, రేఖాంశాలుగా కొలతలు నిర్దేశిస్తామని వెల్లడించారు. ఈ చట్టం వచ్చాక భూమి కోసం ఎవరూ గొడవ పడే అవకాశం ఉండదన్నారు. రెవెన్యూ కోర్టులను కూడా రద్దు చేస్తున్నట్లు సభా వేదికగా కేసీఆర్‌ ప్రకటించారు. భూముల విషయంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఇక నుంచి వారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్నట్లు చెప్పారు.

వీఆర్వోలు ఆందోళన చెందవద్దు :

ఇక వీఆర్వోలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకా ఉండబోదని స్పష్టం చేశారు. వారికి ఆప్షన్లు ఇచ్చి ఇతర శాఖల్లో ఉద్యోగం కేటాయిస్తామని, ప్రజలకు మేలు చేసేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి ముఖ్యంగా రైతులకు పేదలకు సరళీకృతమైనటువంటి కొత్త చట్టాన్ని ఈ సభలో ప్రతిపాదిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఈ బిల్లు వర్తిస్తుందని, నవీన కాలంలో అనేక ఉత్పత్తి సాధనలు వచ్చాయి.. మనిషి జీవితం భూమి చుట్టూ తిరిగింది.. గత ఐదారు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి భూమి ఉత్పత్తి సాధనంగా గుర్తించడంతో దాని విలువ పెరిగింది అని అన్నారు. నేటికి కూడా భూ సమస్యలున్నాయని, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్‌, చంద్రబాబు, వైఎస్‌ఆర్‌ హయాంలో కొన్ని మార్పులు జరిగాయని గుర్తు చేశారు. గత పాలకుల రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించలేదన్నారు. రైతులకు మేలు జరిగేందుకు మార్పు చేర్పులు చేస్తున్నామని అన్నారు.

Next Story