కరోనా నుంచి ప్రమాదకరమైన మరో కొత్త వైరస్‌: మలేషియా శాస్త్రవేత్తలు

By సుభాష్  Published on  18 Aug 2020 12:35 PM IST
కరోనా నుంచి ప్రమాదకరమైన మరో కొత్త వైరస్‌: మలేషియా శాస్త్రవేత్తలు

ప్రపంచంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఎలాంటి లక్షణాలు లేకుండా కూడా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్‌ రకాల కన్నా పది రేట్లు ఎక్కువ వేగంతో విస్తరించే ఒక కొత్త రకాన్ని గుర్తించినట్లు మలేషియా శాస్త్రవేత్తలు వెల్లడించారు. 'డీ614జీ'గా ఈ కొత్త రకం వైరస్‌ను పిలుస్తున్నారు. కరోనా వైరస్‌ నుంచి ఈ రూపాన్ని సంతరించుకుందని శాస్త్రవేత్తులు చెబుతున్నారు.

కాగా, భారత్‌ నుంచి తిరిగొచ్చిన ఒక రెస్టారెంట్‌ యజమాని క్వారంటైన్‌ నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 45 మందికి ఈ వ్యాధి వ్యాప్తి చేసిన సందర్బంలో ఈ కొత్త వైరస్‌ ను గుర్తించారు. వీరిలో ముగ్గురికి డీ614జీ రకం కరోనా వైరస్‌ సోకిందని వారు తేల్చారు. ఈ రకం వైరస్‌ ఇప్పటికే అమెరికా, ఐరోపాల్లో కనిపించిందని, దీని వల్ల కరోనా మహమ్మారి రెండు సారి విజృంభించే అవకాశాలున్నాయని మలేషియా ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జనరల్‌ నూర్‌ హిషామ్‌ అబ్దుల్లా తెలిపారు.

ఈ కొత్తరకం వైరస్‌ కారణంగా కోవిడ్‌-19 నివారణకు తయారు చేస్తున్న వ్యాక్సిన్‌పై ప్రస్తుతం జరిగిన అధ్యయనాలు అసంపూర్తిగా మిగిలిపోవడం కానీ వ్యాక్సిన్లు పని చేయకపోవడం గానీ జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సార్స్‌-కోవ్‌-2 వైరస్‌లో కొత్తగా వచ్చే మార్పులు తీవ్ర నష్టాన్ని కలిగించకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

Next Story