అటొక్కటి.. ఇటొక్కటి ఇనుపయి ఉంటాయి.. వాటి మింకెల్లి రైలు పోతది కదా.!

By అంజి  Published on  19 Feb 2020 4:35 AM GMT
అటొక్కటి.. ఇటొక్కటి ఇనుపయి ఉంటాయి.. వాటి మింకెల్లి రైలు పోతది కదా.!

హైదరాబాద్‌: 'తెలంగాణ ప్రజలకు ఎర్ర బస్సు తప్ప రైల్వే అంటే ఏంటో తెలియదు' అంటూ తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఓ సమావేశంలో అన్నారు. అయితే ఇప్పుడు కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెట్టింట తెగ దూమారం రేపుతోంది. పలువురు నెటిజన్లు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. మోదీ వచ్చేవరకు రాష్ర్టానికి ఎర్రబస్సే దిక్కనడం మీ అజ్ఞానమే అంటూ కిషన్‌రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ట్రోల్స్‌ చేస్తున్నారు. 'అవును సార్‌.. రైలు పట్టాయి ఇనుపయి కదా.. అటొక్కటి ఇటొక్కటి పెట్టి.. వాటి మింకెల్లి రైలు నడపుతరా? మాకు ఇవ్వారకు తెల్వనే తెల్వదు అంటూ'. నిజాం కాలంలో కూడా ప్రధానిగా నరేంద్రమోదీయే ఉండి రైల్వే లైన్లు వెయిస్తిరి.. మరీ మోదీ లేకుంటే దేశంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగదాయే అంటూ ఎర్రబస్సుకు వ్యాఖ్యలకు నెటిజన్లు ప్రతిస్పందిస్తున్నారు.

మంగళవారం చర్లపల్లిలో శాటిలైట్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్‌పై తెలంగాణ ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మోదీ వచ్చేదాక తెలంగాణకు రైల్వే అంటే ఎంటో తెలియదన్న కిషన్‌ రెడ్డి.. చాలా ప్రాంతాల్లో రైలు సౌకర్యం ఉండేది కాదని, అలాంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక కొంత రైళ్లు ప్రారంభించిందన్నారు. తెలంగాణలో ఎప్పటి నుంచి రైల్వే సేవలు అందుతున్నాయో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారని, ఈ వివరాలు మీకు తెలియవా అంటూ కిషన్‌రెడ్డిని ఎద్దేవా చేస్తున్నారు.

ఇది వరకు కిషన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అంబర్‌పేట్‌ పరిధిలోనే ప్రఖ్యాత కాచిగూడ రైల్వేస్టేషన్‌ ఉందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌లో కూడా సికింద్రాబాద్‌, నాంపల్లి స్టేషన్లు ఉన్నాయని అంటున్నారు. అయితే ఆ స్టేషన్లు ఎప్పుడు ప్రారంభమయ్యాయో తెలియదా అంటూ కిషన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. నిజాం కాలంలోనే తెలంగాణలో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చాయని, అప్పుడు మోదీ సొంతరాష్ట్రమైన గుజరాత్‌లో కరెంట్‌ కూడా ఉండేది కాదని నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తున్నారు. మోదీ అమ్మ గారు పుట్టిన సంవత్సరం 1920 అని.. మరి తెలంగాణలో రైల్వే మొదైలన సంవత్సరం 1870 అంటూ, ఎవరికి ఎవరు రైల్వే అంటే తెలియజెప్పారో అంటూ చెడుగుడు ఆడుతున్నారు.

తెలంగాణ రైల్వే చరిత్ర

1870లో నిజాం పాలన కాలంలో నిజాంస్టేట్‌ రైల్వే వ్యవస్థ ఏర్పాటు అయ్యింది. 1907లో నాంపల్లి, 1916లో కాచిగూడ రైల్వేస్టేషన్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 1966లో నిజాంస్టేట్‌ రైల్వేను.. కేంద్రప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చి దక్షిణమధ్య రైల్వేగా మార్పు చేశారు. 1938లో జనవరి 12న.. జాం స్టేట్‌రైల్వే ముక్కోటి ఏకాదశికి భద్రాచలం వెళ్లే భక్తులకు రైల్వేలో రాయితీపై ఇచ్చిందని గోల్కొండ పత్రికలో ప్రకటన కూడా వచ్చింది.

Next Story