నేరేడుచర్ల ఉత్కంఠకు తెర.. చైర్మన్‌గా జయబాబు

By అంజి  Published on  28 Jan 2020 7:21 AM GMT
నేరేడుచర్ల ఉత్కంఠకు తెర.. చైర్మన్‌గా జయబాబు

సూర్యాపేట: నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్‌ పదవి కోసం కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ సభ్యుల మధ్య నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్‌ చైర్మన్‌గా జయబాబు, వైస్‌ చైర్మన్‌గా చల్లా శ్రీలత ఎన్నికయ్యారు. కాగా చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ నుంచి కాంగ్రెస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డికి ఓటు హక్కు కల్పించడంపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరేడుచర్ల చౌరస్తాలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేవీపీ బైఠాయించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఉత్తమ్‌కుమార్‌ మండిపడ్డారు. ప్రతి రోజు ఓటరు లిస్ట్‌ ఎలా మారుస్తారంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ హుందాతనం నేర్చుకోవాలన్నారు. ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని ఉత్తమ్‌ కుమార్‌ అన్నారు.

కాగా కేవీపీ ఓటు తొలగింపు ఆదేశాలను ఎన్నికల సంఘం రద్దు చేసింది. దీంతో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎక్స్‌ అఫిషియో సభ్యుల ప్రమేయం లేకుండా నేరేడుచర్లలో చైర్మన్ ఎన్నిక చేపట్టాలని ఉత్తమ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ మెజార్టీ ఉన్న టీఆర్‌ఎస్‌ కుట్రలు చేసిందని విమర్శించారు.

నేరేడుచర్లలోని 15 వార్డులకు గాను కాంగ్రెస్‌ కూటమి 8, టీఆర్‌ఎస్‌ 7 వార్డులు గెలిచాయి. అయితే కాంగ్రెస్‌ సృష్టమైనా మెజార్టీ ఉన్నా.. చైర్మన్‌ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని టీఆర్‌ఎస్‌ ప్లాన్‌ వేసింది. టీఆర్‌ఎస్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఎంపీ బండగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యే శానంపూడిసైదిరెడ్డి, ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు ఉన్నారు. కాంగ్రెస్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఎంపీ ఉత్తమ్‌, ఎంపీ కేవీపీ రామచంద్రావులు ఉన్నారు. కాగా కేవీపీకి ఓటు హక్కు కల్పిస్తున్న ఇచ్చిన ఉత్తర్వులను ఎస్‌ఈసీ రద్దు చేసింది.

Next Story