క్వారంటైన్‌కు 200 మంది నీలోఫర్ ఆసుపత్రి సిబ్బంది
By తోట వంశీ కుమార్
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతోంది. ఇతర ప్రాంతాల్లో కంటే.. హైదరాబాద్‌లో ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంది. ఓ చిన్నారి కారణంగా నిలోఫర్ ఆస్పత్రిలో పని చేస్తున్న 200 మంది సిబ్బంది క్వారంటైన్‌కు వెళ్లాలని ఆస్పత్రి సూపరింటెండ్ ఆదేశాలు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే.. నారాయణపేట్ అభంగాపూర్‌కు చెందిన జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. 45 రోజుల తరువాత ఆ బాలుడికి జ్వరం వచ్చింది. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు మహబూబ్ నగర్ ఏరియా ఆస్పత్రికి బిడ్డను తీసుకొచ్చారు. అక్కడి వైద్యుల సూచనలతో ఈనెల 15న నీలోఫర్ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ చిన్నారి నుంచి సేకరించి శాంపిల్స్‌తో కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. దీంతో.. ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఆస్పత్రిలో విధులు నిర్వహించిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, నర్సువైద్యుల, ఇతర సిబ్బంది.. మొత్తం దాదాపు 200 మంది క్వారంటైన్‌కు వెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యాయి.