హైదరాబాద్ జూ కు అరుదైన జంతువులు

By రాణి  Published on  3 Feb 2020 7:30 AM GMT
హైదరాబాద్ జూ కు అరుదైన జంతువులు

హైదరాబాద్ లోని నెహ్రూ జూ లాజికల్ పార్క్ ఎన్నో అరుదైన జీవరాశులకు నిలయం. హైదరాబాద్ చూడటానికి వచ్చిన వాళ్ళు 'జూ' ను చూడటం కూడా తమ లిస్టులో పెట్టుకుంటూ ఉంటారు. చూసిన జంతువులనే మరోసారి చూడాలి అంటే ఎవరూ ముందుకు రారు..! అందుకే దేశంలోని జంతు ప్రదర్శన శాలలు ఆనిమల్ ఎక్స్ ఛేంజ్(జంతువులను కొద్ది రోజుల పాటూ తమ నగరంలో ఉన్న జూలో ఉంచుకోవడం) ప్రోగ్రామ్ ను తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే అతి త్వరలో హైదరాబాద్ జూ కు అరుదైన జింకలు(swamp deer, barasingha) రెండు, సింహపు తోక ఉండే వానరం(lion tailed macaque) రానున్నాయి. చెన్నై వాండలూర్ జూ తో ఉన్న ఒప్పందంతో వీటిని ఫిబ్రవరి నెల చివరి లోపు హైదరాబాద్ జూ కు తరలించనున్నారు. గత ఏడాది ఆగష్టు నెలలో నెహ్రూ జూలాజికల్ పార్క్ నుండి ఒంటి కొమ్ము ఖడ్గమృగాన్ని చెన్నై వాండలూర్ జూ కు పంపారు. ఇప్పుడు వారు వీటిని హైదరాబాద్ కు పంపించనున్నారు.

నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఇప్పటికే సింహపు తోక ఉండే మగ వానరం ఉందని.. ఇప్పుడు ఆడ వానరం రానుందని జూ క్యూరేటర్ ఎన్.క్షితిజ తెలిపారు. అలాగే నాలుగు గ్రే రంగు కంగారూలు, ఒక జత మీర్ క్యాట్, ఆసియా సింహాల జంట కోసం కూడా పేపర్ వర్క్ జరుగుతోందని క్యూరేటర్ వెల్లడించారు. కంగారూలు, మీర్ క్యాట్ లు జపాన్ లోని యోకొహోమా జూలాజికల్ గార్డెన్ నుండి ఆనిమల్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రామ్ కింద తీసుకొని రానున్నామన్నారు. జపాన్ నుండి ఈ జంతువులు రావడానికి రెండు మూడు నెలల సమయం పడుతుందని అన్నారు. కంగారూలు, మీర్ క్యాట్ లు హైదరాబాద్ జూకు రావడం తొలిసారని.. వీటిని చూడడానికి ప్రజలు బాగా ఆసక్తిని చూపిస్తారని జూ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం తతంగం పూర్తీ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆదేశాల కోసం జూ అధికారులు ఎదురుచూస్తూ ఉన్నారు. నెహ్రూ జూ లాజికల్ పార్క్ 380 ఎకరాల్లో విస్తరించి ఉంది. 173 రకాల జాతుల జంతువులు ఇక్కడ ఉన్నాయి.

Next Story