హైదరాబాద్‌: ఎన్పీఆర్‌ (జాతీయ పౌర పట్టిక)కు సమయం ఆసన్నమైంది. ఎన్పీఆర్‌ను తయారుచేసేందుకు దేశవ్యాప్తంగా కసరత్తు ప్రారంభమైంది. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా జనాభా లెక్కల సవరణ జరగనుంది. దేశ రాజధాని ఢిల్లీలో మొదటగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తన పేరును నమోదు చేసుకున్నాక.. ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఆ రోజునే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ పేర్లను నమోదు చేయించుకుంటారని సమాచారం. రాష్ట్రాల్లో హౌజింగ్‌ సెన్సెస్‌తో దీన్ని షూరు చేయనున్నారు.

తెలంగాణలోనూ ఎన్పీఆర్‌ను మరోసారి రూపొందించేందుకు అడుగులు పడుతున్నాయి. జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి అధికారులకు తెలంగాణ సెన్సెస్‌ డైరెక్టర్‌ కె.ఇలంబరితి ఇప్పటికే లేఖ రాశారు. ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ చివరి వారం వరకు హౌజింగ్‌ సెన్సెస్‌, ఎన్పీఆర్‌ అప్‌డేషన్‌ జరగనుందని ఆమె లేఖలో పేర్కొన్నారు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కేంద్రహోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పౌర పట్టిక ద్వారా జనాభా లెక్కలను చేపడతారు. 2019 సంవత్సరం నవంబర్‌ 9న తెలంగాణ ప్రభుత్వం జీవో 235ను జారీ చేసిందని ఆయన తెలిపారు. దీని ప్రకారం.. జనాభా లెక్కల అధికారులను నియమిస్తున్న ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రిన్సిపల్‌ సెన్సస్‌ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఎన్పీఆర్‌ సేకరణ వారి బాధ్యతన అని ఇలంబరితి తన లేఖలో వివరించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి చివరి వారం, మార్చి మొదటి వారంలో జిల్లా, చార్జి ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దీనిపై ప్రిన్సిపల్‌ సెన్సస్‌ అధికారులు వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలన్నారు. అలాగే సెన్సస్‌ అధికారులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కోరారు.

మరోవైపు తెలంగాణ విద్యాశాఖ ‘అర్జంట్‌’ పేరిటి మెమో 990ని జారీ చేసింది. జనాభా లెక్కల సేకరణ, ఎన్పీఆర్‌ అప్‌డేషన్‌, హౌజింగ్‌ సర్వే నేపథ్యంలో.. శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఎటువంటి పరీక్షలను నిర్వహించకూడదని పేర్కొంది. ఫిబ్రవరి 8న వరంగల్‌ రూరల్‌ కలెక్టర్‌, ప్రిన్సిపల్‌ సెన్సస్‌ అధికారి ఎం.హరిత.. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల నియమాకానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. జనాభా లెక్కల సేకరణ రెండు దశల్లో జరగనుంది. ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ వరకు హౌజింగ్‌ సర్వేతో పాటు ఎన్పీఆర్‌ను అప్‌డేషన్‌ చేయనున్నారు. అలాగే వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జనాభా లెక్కల సేకరణ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల ప్రోఫర్మాను జనాభా లెక్కల విభాగం అడుగుతోందని, దీనికి సంబంధించిన నివేదికను అందజేయాలని జిల్లా అధికారులను కలెక్టర్‌ ఎం.హరిత కోరారు. కాగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్పీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యహరిస్తుందో చూడాల్సి ఉంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.