జనాభా లెక్కలు జాతీయ జనాభా జాబితా ఏమిటి? ఎందుకు?ఎలా?
By Newsmeter.Network Published on 25 Dec 2019 9:24 PM ISTకొత్త సంవత్సరం వస్తుంది. 2019 గతమై, 2020 మొదలవుతుంది. 2020 లో కేంద్ర ప్రభుత్వం రెండు పెద్ద కార్యక్రమాలను ప్రారంభిస్తుంది. మొదటిది 2021 లో జరగనున్న జనాభా లెక్కల ముందస్తు తయారీలో భాగంగా దేశ వ్యాప్తంగా ఇంటి చిరునామాల సర్వే జరుగుతుంది. రెండవది జాతీయ జనాభా రిజిస్టర్. దీనిని కూడా దేశ వ్యాప్తంగా చేపట్టనున్నారు. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం 3941.35 కోట్ల రూపాయలను కేటాయించింది.
ఇంతకీ జాతీయ జనాభా రిజిస్టర్ అంటే ఏమిటి
నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లేదా ఎన్ పీ ఆర్ అంటే దేశంలో సాధారణంగా నివసించే వ్యక్తులందరి జాబితా. దీనిని గ్రామ/నగర/ఉపజిల్లా/ జిల్లా/ రాష్ట్ర/ జాతీయ స్థాయిలో తయారు చేస్తారు. దీనిని పౌరసత్వ చట్టం 1955, పౌరసత్వ (పౌరుల నమోదు, జాతీయ గుర్తింపు కార్డు) నియమాలు 2003 ప్రకారం నిర్వహిస్తారు.
సాధారణ వ్యక్తి అంటే ఎవరు?
ఎన్ పీ ఆర్ దృష్ట్యా భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా గత ఆరు నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం నివసించే వారు లేదా రానున్న ఆరు నెలల పాటు నివసించ దలచిన వారిని సాధారణ వ్యక్తిగా పరిగణించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు
చట్ట ప్రకారం ప్రతి భారతీయ పౌరుడి పేరును తప్పనిసరిగా నమోదు చేయాలి. వారందరికీ ఒక జాతీయ గుర్తింపు కార్డ్డును ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో నిర్వహిస్తారు. అసొం తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దీనిని చేపడతారు. జనాభా లెక్కల నిమిత్తం ఇళ్లను లెక్కించి, జాబితా తయారు చేసే ప్రక్రియతో పాటు దీనిని నిర్వహిస్తారు. దీనినుంచి అసొంను ఎందుకు మినహాయించారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అసొంలో ఇటీవలే ఎన్ ఆర్ సీ (జాతీయ పౌరుల జాబితా) ను నిర్వహించారు. కాబట్టి అక్కడ ఇది అవసరం లేదు.
అసలు ఎన్ పీ ఆర్ ఎందుకు
ఎన్ ఆర్ పీని రిజిస్ట్రార్ జనరల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. జనాభా లెక్కల నిమిత్తం ఆయన సెన్సస్ కమీషనర్ గా వ్యవహరిస్తారు. ఈ ఎన్ పీ ఆర్ ద్వారా దేశంలని ప్రతి సాధారణ వ్యక్తి తాలూకుపూర్తి డేటా బేస్ ను రూపొందించడం జరుగుతుంది. ఇందులో వారి జనాభా పరమైన, బయోమెట్రిక్ పరమైన వివరాలుంటాయి. వ్యక్తి పేరు, కుటుంబ పెద్దతో సంబంధం, తండ్రి పేరు, తల్లిపేరు, వివాహమైతే జీవిత భాగస్వామి పేరు, పురుషుడా, మహిళా, పుట్టిన తేదీ,, జాతీయత, తాజా చిరునామా, అక్కడ ఎంతకాలంగా నివసిస్తున్నారు, శాశ్వత చిరునామా, వృత్తి, విద్యార్హతలు నమోదు చేస్తారు.
గతంలో ఈ డేటాను ఎప్పుడు సేకరించారు
గతంలో 2010 లో 2011 జనాభా లెక్కల లో భాగంగా ఇళ్ల లిస్టింగ్ తో పాటు సేకరించడం జరిగింది. ఆ తరువాత ఈ డేటాను ఇంటింటి సర్వే ద్వారా అప్ డేట్ చేశారు. ఇప్పుడు జరగబోతున్న ఎన్ పీ ఆర్ కోసం 2019 ఆగస్టులోనే నోటిపికేషన్ జారీ అయింది.
మరి జనాభా లెక్కలంటే ఏమిటి
జనాభా లెక్కలు పదేళ్లకొకసారి నిర్వహించడం జరుగుతుంది. 1948 నాటి జనాభా లెక్కల చట్టం ప్రకారం వివిధ అంశాలపై వివరాలను సేకరించడం జరుగుతుంది. దీని వల్ల పలు అంశాలపై సమాచారం ప్రభుత్వానికి లభిస్తుంది. వీటి ఆధారంగానే పథకాలను రూపొందించడం జరుగుతుంది. 2021 జనాభా లెక్కలు రెండు దశల్లో జరుగుతాయి. తొలి దశలో హౌస్ లిస్టింగ్ జరుగుతుంది. ఇది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2020 లో జరుగుతుంది. రెండవ దశ ఫిబ్రవరి 9 నుంచి డిసెంబర్ 28, 2021 వరకూ జరుగుతుంది. మార్చి 1 రాత్రి 00.00 ను రెఫరెన్స్ పాయింట్ గా స్వీకరిస్తారు. అయితే మంచు బాగా పడే జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హిమాచల్, ఉత్తరాఖండ్ లలో మాత్రం అక్టోబర్ 1, 2020 ని రిఫరెన్స్ డేట్ గా ఉంటుంది.
జనాభా లెక్కల ద్వారా గత దశాబ్దంలో దేశం సాధించిన ప్రగతిని, వివిధ సంక్షేమ పథకాల అమలు తీరును, భవిష్యత్ ప్రణాళికల విషయంలో వ్యూహ రచన విధానాన్ని విశ్లేషించుకోవచ్చు. ఖచ్చితమైన జనాభా వివరాలు, ఆర్ధిక కార్యకలాపాలు, సాక్షరత స్థాయి, ఇళ్లు, వాటి లోని సదుపాయాలు, సౌకర్యాలు, పట్టణీకరణ ఏ మేరకు జరుగుతుంది, జనాభా పెరుగుదల రేటు, మరణాల రేటు, షెడ్యూల్డు కులాలు, తెగలు, భాష, మత పరమైన వివరాలు, వలసల వివరాలు, వికలాంగుల వివరాలు సేకరించడానికి వీలవుతుంది. వ్యవసాయదారులెందరు, వ్యవసాయ కూలీలెందరు, వారిలో స్త్రీ పురుషులెంరు, కార్మికుల విభాగాలు, వివిధ కుటుంబేతర పరిశ్రమల వివరాలు, వ్యాపారం, వృత్తి వివరాలు వంటి విషయాలను కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది.
జనాభా లెక్కల్లో ఏయే వివరాలను సేకరిస్తారు
స్త్రీలా పురుషులా, సాక్షరత, నగరాల సంఖ్య, మురికి వాడల సంఖ్య, అందులో కుటుంబాల సంఖ్య, జనాభా వివరాలు, వారికి త్రాగు నీటి లభ్యత, విద్యుత్ సదుపాయం, నీటి పారుదల సదుపాయం, వ్యవసాయం చేసే విధానం, ఇల్లు పక్కా ఇల్లా, గుడిశా లేక వేరేదా అన్న వివరాలను జనాభా లెక్కల్లో సేకరిస్తారు.
దేశంలో జనాభా లెక్కలు ఎప్పట్నుంచి మొదలయ్యాయి
జనాభా లెక్కలకు 130 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇన్నేళ్లలో ఒక నమ్మకమైన పద్ధతి ప్రక్రియ ప్రకారం జనాభా లెక్కలు జరిపే విధివిధానాలు నిర్ధారితమయ్యాయి. తొలి జనాభా లెక్కలు 1872 లో ప్రారంభమయ్యాయి. అయితే అప్పట్లో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో జనాభా లెక్కలు నిర్వహించేవారు. ఇప్పుడు దేశమంతటా ఒకే సమయంలో జనాభా లెక్కలు నిర్వహిస్తున్నారు. క్రమబద్ధమైన పద్ధతిలో జనాభా లేక్కలు సేకరించేందుకు 1949 లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లో రిజిస్ట్రార్ జనరల్ ఎక్స్ అఫీషియో సెన్సస్ కమీషనర్.. ఆధ్వర్యాన ఒక విభాగం ఏర్పడింది.1969 లో ఈ విభాగానికే జనన మరణాల చట్టం మేరకు సేకరించిన వివరాలను కూడా ఈ విభాగమే నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.