ఒకప్పుడు జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్ - ఇప్పుడు ఛాయ్ వాలా

By రాణి  Published on  20 Dec 2019 5:53 AM GMT
ఒకప్పుడు జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్ - ఇప్పుడు ఛాయ్ వాలా

ముఖ్యాంశాలు

  • పాట్నాలో టీ అమ్ముకుని బతుకుతున్న జాతీయ స్విమ్మర్
  • జాతీయ స్థాయిలో పతకాలు సాదించిన గోపాల్ ప్రసాద్
  • కుటుంబ పోషణ కోసం టీ వ్యాపారాన్ని ఎంచుకున్న గోపాల్
  • తండ్రి చనిపోయిన తర్వాత గోపాల్ మీద కుటుంబం భారం
  • మెడలో మెడల్స్ వేసుకుని టీ కాచి అమ్మే గోపాల్ ప్రసాద్

పాట్నాలోని నయాటోలా ప్రాంతంలో కాజీపూర్ బైలైన్స్ మీదుగా వెళ్లినవాళ్లు ఎవరైనా సరే గోపాల్ ప్రసాద్ యాదవ్ టీ స్టాల్ కి వెళ్లి తీరాల్సిందే. ఆయన ఇచ్చే రుచికరమైన టీ తాగితేనే గానీ ఇటుగా వచ్చిన వాళ్లకు ఎవరికైనా సరే కాళ్లు ముందుకు కదలవు. టీ పెట్టడంలో అంతటి నిష్ణాతుడైన గోపాల్ యాదవ్ జాతీయ స్థాయిలో గౌరవాన్ని తెచ్చిపెట్టిన స్విమ్మర్ అని తెలిస్తే వచ్చినవాళ్లు ఆశ్చర్యపోక తప్పదు. నేషనల్ లెవెల్లో పతకాల పంట పండించిన ఈ పూర్వ స్విమ్మర్ కు దక్కుతున్న గౌరవం ఇదీ అని తెలుసుకుని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

రోజూ ఇటువైపుకు వచ్చిపోయేవాళ్లకు గోపాల్ యాదవ్ టీ దుకాణం బోల్డన్ని ముచ్చట్లు చెప్పుకునే అడ్డా. రోజూ దుకాణానికి వచ్చి టీ పెట్టి అమ్మే గోపాల్ మర్చిపోకుండా తాను జాతీయ స్థాయిలో సంపాదించిన పతకాలను మెడలో వేసుకోవడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం. గోపాల్ ని చూసి మరీ అంత సీన్ అవసరమా అని ఆక్షేపించేవాళ్లూ ఉన్నారు. కానీ ఆయన మాత్రం తాను సాధించిన ఘనతను పదిమందికీ తెలిసేలా చేయాలన్న తలంపుతో ఈ పని చేస్తున్నారు.

ఆర్థిక స్థోమత లేకపోవడంవల్ల నెరవేరని కల

గోపాల్ వయసులో ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో తనో స్పోర్ట్స్ ఐకాన్ గా నిలవాలని కలలు కన్నాడు. కానీ విధి మరోదారి చూపించింది. తను బతకడానికీ, తన వాళ్లను బతికించుకోవడానికీ ఆయన ఆ దారిని గౌరవించక తప్పలేదు. నీతిగా, నిజాయతీగా బతకడంలో ఉన్న ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవని గోపాల్ చెబుతాడు. ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన తను ఇలా టీ దుకాణం నడుపుకోవాల్సి వచ్చింనందుకు బాధగానే ఉన్నా, నీతిగా స్వశక్తి మీద ఆధారపడి బతకడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని ఆయన అందరికీ చెబుతాడు.

జాతీయ స్థాయిలో పతకాల పంట పండించిన గోపాల్ సరైన ప్రోత్సాహం లేక ఇలా మిగిలిపోయాడు. ఉన్నట్టుండి తండ్రి చనిపోవడం, అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్న కుటుంబ ఆర్థిక పరిస్థితి గోపాల్ ని ఈ దిశగా నడిపించాయి. తనే నాలుగు రాళ్లు సంపాదించి కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. దాంతో ఇంకేం ఆలోచించకుండా గోపాల్ ఒక గట్టి నిర్ణయం తీసేసుకుని టీ కొట్టు పెట్టేసుకున్నాడు.

National Level Swimmer Gopal

ఆశలన్నీ అడియాశలయ్యాయి

మొదట్లో ఎవరైనా గొప్పవాళ్లు ఇటుగా వచ్చినప్పుడు తన మెడలో ఉన్న మెడల్స్ ని చూసి సరైన ప్రోత్సాహాన్ని ఇవ్వకపోతారా అన్న ఆశతో వాటిని మెడలో వేసుకునేవాడు గోపాల్. కానీ త్వరలోనే ఆ ఆశలన్నీ అడియాసలేనని గోపాల్ కి తెలిసొచ్చింది. అసలు అతనివైపుకు ఆ దృష్టికోణంలో చూసినవాళ్లే లేకపోయారు. అయితేనేం.. తాను సాధించిన ఘనతను అందరికీ తెలిసేలా చేయాలనుకున్నాడు గోపాల్. అప్పట్నుంచీ అలా రోజూ తాను సాధించిన మెడల్స్ ని మెడలో వేసుకునే టీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.

రాష్ట్రంలో ఉన్న చాలామంది అథ్లెట్లు గోపాల్ చేసిన పని చూసి ఆశ్చర్యపోయారు. గోపాల్ గురించి, తాను నడుపుతున్న టీ దుకాణం గురించి చాలా గర్వంగా అనేక సందర్భాల్లో అనేక వేదికలమీద చెప్పారు కూడా. చాలా బీద కుటుంబంనుంచి వచ్చిన గోపాల్ కి కోచ్ ని పెట్టుకునే స్థోమతగానీ, స్మిమ్మింగ్ పూల్స్ కి వెళ్లి ప్రాక్టీస్ చేసే తాహత గానీ, స్పాన్సర్లు గానీ కనిపించలేదు. అలా ఆయన జీవితం ఏళ్లుగా ఈ టీస్టాల్ కే అంకింతం అయిపోయింది.

అతి కొద్దికాలం పాటు స్విమ్మింగ్ పోటీల్లో జాతీయ స్థాయిలో పాల్గొన్నా, ఉన్నంత కాలం గోపాల్ తాను ఎంచుకున్న రంగంలో మెరుపులు మెరిపించాడు. 1986లో గోపాల్ స్మిమ్మింగ్ కెరీర్ మొదలయ్యింది. రోజూ గంగానదికి వెళ్లి ఈతకొట్టి రావడం మొదట్లో ఆయన దినచర్యలో మొదటిభాగం. 1987నుంచి జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. అప్పట్లో గోపాల్ వేగాన్ని, నైపుణ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు.

జిల్లా స్థాయినుంచి రాష్ట్ర స్థాయికి, అక్కడి నుంచి జాతీయ స్థాయికి చేరుకోగలిగిన గోపాల్ 1998లో తొలి జాతీయ స్థాయి పతకాన్ని సాధించాడు. జాతీయ స్థాయి ఈత పోటీల్లో విజయం సాధించిన తర్వాత కూడా ఆయన ఆర్థిక స్థితిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. ఎందుకంటే గోపాల్ కి లేనిదల్లా ఒక్కటే.. అండదండలు, ఆర్థికపరమైన సహకారం. ఉన్నదల్లా ఒక్కటే.. అచంచలమైన ఆత్మ విశ్వాసం. కుటుంబంకోసం తనకు ఎంతో ఇష్టమైన కెరీర్ నుకూడా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు గోపాల్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. 1990లో తండ్రి చనిపోయినప్పుడు ఆయన కుటుంబ పోషణ భారాన్ని తన భుజాలమీద వేసుకున్నాడు.

జీవన పోరాటం

తండ్రి చనిపోయిన తర్వాత జీవితం అంటే ఏంటో తెలిసొచ్చింది తనకు. కనీసం ఈ టీ దుకాణాన్ని నడపడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. కానీ ఎలాగోలా తన తండ్రి నడిపిన టీ స్టాల్ తోనే జీవితంలో ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాడు ఈ చాయ్ వాలా. జీవన పోరాటంలో పడిపోయిన తర్వాత మెల్లగా ప్రాక్టీస్ మరుగున పడిపోయింది. పూర్తిగా తను కుటుంబంపైనే ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. మొదట్లో కొద్దికాలంపాటు రెండింటికీ మధ్య సమతౌల్యాన్ని సాధించాలని గట్టిగానే ప్రయత్నించాడు. కానీ చివరికి జీవన పోరాటంలో తాను ఎంతగానో ఇష్టపడిన కెరీర్ ని వదులుకోక తప్పలేదు.

టీ వ్యాపారం

గోపాల్ టీ స్టాల్ ఉదయం ఆరు గంటలకే తెరుచుకుంటుంది. ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో మూసేస్తాడు. తిరిగి సాయంత్రం మూడున్నరకు మళ్లీ తెరుస్తాడు. అప్పట్నుంచీ రాత్రి పదిన్నర గంటలవరకూ వ్యాపారం కొనసాగుతుంది. మధ్యాహ్నంపూట మాత్రం ఈ ప్రాంతంలో పెద్దగా జనసంచారం కనిపించదు. దానివల్ల ఆ సమయంలో ఉండి పెద్దగా చేసేదేం లేదుకనుక తొమ్మిదిన్నరకే దుకాణం కట్టేసి ఇంటికెళ్లిపోవడం నేర్చుకున్నాడు. మధ్యాహ్నం మూడున్నర దగ్గరనుంచి మెల్లగా వ్యాపారం ఊపందుకుంటుంది. ఏళ్లుగా ఇదే గోపాల్ దినచర్య.

తన మెళ్లో ఉన్న పతకాలు తన దుకాణానికి ఎక్కువమందిని ఆకర్షించడానికి మాత్రం ఉపయోగపడ్డాయంటాడు గోపాల్. చాలామంది అంత విలువైన పతకాలను జాగ్రత్తగా ఎక్కడైనా దాచుకోవచ్చుగదా అని సలహాకూడా ఇచ్చారట. కానీ గోపాల్ ఈ పతకాలు నా టీస్టాల్ కి జనాన్ని తీసుకురావడానికీ, నా వ్యాపారానికి ఆకర్షణకూ తప్ప దేనికీ పనికిరావని అలా చెప్పినవాళ్లకు సమాధానమిస్తాడు.

కుటుంబం

గోపాల్ భార్య ఉషాదేవి. పిల్లలు సోను, సన్నీ, సోనీ. ఈ నలుగురే తన జీవితం. వీళ్లే తనకు సర్వస్వం. ఈ టీ దుకాణంమీద గోపాల్ కి నెలకు కేవలం రూ.6,000 మాత్రం వస్తాయి. తన భార్య పిల్లలే తనకు సర్వస్వం. పిల్లల చదువుసంధ్యలు, ఇంటి పోషణ కేవలం ఈ సంపాదన మీదే జరగాలి. ఇరవై ఏళ్ల చిన్న కొడుకు సన్నీకూడా స్విమ్మరే. తన టాలెంట్ ని చూసి గోపాల్ గంగానదికి తీసుకెళ్లి స్వయంగా శిక్షణ ఇచ్చాడు. తండ్రి దగ్గరే కోచింగ్ తీసుకున్న సన్నీ అనేక పోటీల్లో విజయం సాధించాడు.

కానీ మళ్లీ ఈసారి కూడా ఆర్థిక పరిస్థితే అవరోధం అయింది. దాంతో గోపాల్ తన కొడుకును ఏదైనా ఉద్యోగం చూసుకోమని చెప్పాడు. వేన్నీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్టుగా కొడుకు కూడా నాలుగు రాళ్లు సంపాదిస్తే కుటుంబపోషణ భారం తగ్గుతుందన్నది ఆయన ఆలోచన. నగరంలోని ఓ పేరుమోసిన ప్రింటింగ్ ప్రెస్ లో సన్నీ పనిచేస్తున్నాడు. పెద్ద కొడుకు సోనూ కొరియర్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. కూతురు సోనీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటోంది.

ప్రధాని నరేంద్రమోడీతో సంభాషణ

కిందటి ఏడాది ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడే అవకాశం వచ్చింది గోపాల్ కి. నయాటోలా సమీపంలో ఉన్న ఆటస్థలంలో ఆ సెషన్ ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశం కలిగినందుకు ఎంతగానో సంతోషించాడు గోపాల్. తనకు జీవితంలో అదే చాలా పెద్ద విజయమని అందరితోనూ గర్వంగా చెప్పుకుంటాడు. తన పరిస్థితిని పీఎంకి చెప్పాననీ, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగమనీ, విజయాలు సాధించమనీ ఆయన ప్రోత్సహించారనీ సంతోషంగా చెబుతాడు గోపాల్.

సమ్మర్ కోచింగ్ క్యాంపులు

తాను అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఇంకెవరైనా పిల్లలు అందుకోగలిగితే సంతోషంగా ఉంటుందని గోపాల్ చెబుతాడు. అందుకే వేసవి సెలవుల్లో ఔత్సాహికులైన చాలామంది పిల్లలకు గంగానదిలో ఈతకొట్టడంలో మెళకువలు నేర్పుతాడు ఈ పూర్వ జాతీయ స్విమ్మర్. వేసవి సెలవుల్లో ప్రతి ఆదివారం కనీసం రెండు గంటలపాటు గంగానదిలో పిల్లలకు ఈత కొట్టడంలో ఫ్రీ కోచింగ్. చలికాలంలో మంచు బాగా ఉండడంవల్ల నదిలో నీరు చాలా చల్లగా ఉంటుంది. అంత చల్లటి నీటిలో ఈత కొట్టడం కష్టం కనుక ఆ సమయంలో మాత్రం కోచింగ్ క్లాసులు చెప్పడు.

మిత్రుల ప్రోత్సాహంతో జాతీయస్థాయి స్విమ్మర్ గా..

గంగానది తీరంలో ఒంటరిగా కూర్చుని సంతోషాన్ని పొందడం గోపాల్ కి ఇష్టమైన పని. చిన్నప్పుడు తన మిత్రులతో కలసి గంగానదికి ఈత కొట్టడానికి వచ్చేవాడు గోపాల్. అలా అలా మెల్లగా ఈతంటే ఇష్టం పెరిగింది. క్రమంగా సామర్థ్యాన్ని పెంచుకుంటూ మెళకువలు నేర్చుకుంటూ గజ ఈతగాడయ్యాడు. గంగానదిలో మిత్రులందరూ కలసి పోటీలు పెట్టుకుని మరీ ఈతకొట్టేవాళ్లట అప్పట్లో. ఆ పోటీలే తనను జాతీయ స్థాయి స్విమ్మర్ గా తీర్చి దిద్దాయని చెబుతాడు ఈ మట్టిలో మాణిక్యం.

తన ప్రాణ మిత్రుడు బంటీనే జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనమని చాలా ఒత్తిడి చేసేవాడనీ, కేవలం అతని ప్రోత్సాహం వల్లనే తను ఇన్ని విజయాలు సాధించగలిగాననీ గోపాల్ చెబుతాడు. కిందటి ఏడాది తీవ్ర ఆనారోగ్యం కారణంగా బంటీ చనిపోయాడు. బంటీ లేని లోటు తనకు ఎవరూ తీర్చలేనిదని కళ్లలో నీళ్లు చిప్పిల్లుతుండగా చెబుతాడు గోపాల్. మరో ముగ్గురు స్నేహితులు ఉపాధికోసం బీహార్ కి వెళ్లిపోయారు.

అథ్లెట్స్ కి ప్రభుత్వ సాయం అవసరం

ఔత్సాహికులైన పేద ఆటగాళ్లకు ప్రభుత్వం తప్పనిసరిగా సాయం అందించాల్సిన అవసరం ఉందని గోపాల్ చెబుతున్నాడు. తనలాగే ఎంతోమందికి ఎన్నో అద్భుతాలు సాధించాలని కోరిక ఉంటుందనీ, కేవలం ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంవల్లనే దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు రాణించలేకపోతున్నారనీ, జీవన పయనంలో ముందడుగు వేయలేకపోతున్నారనీ, సామాన్యులుగానే మిగిలిపోతూ జీవన పయనాన్ని సాగిస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు గోపాల్. కనీసం కొంతమందికైనా ప్రభుత్వం సాయం చేయగలిగితే మట్టిలోంచి ఎన్నో మాణిక్యాలను వెలికి తీసుకురావొచ్చని అభిప్రాయపడుతున్నాడు.

గోపాల్ సాధించిన విజయాలు

సంవత్సరంపతకాలుఛాంపియన్ షిప్
1987బంగారు పతకంఅంతర్ రాష్ట్ర స్విమ్మింగ్ చాంపియన్ షిప్ - బీహార్
1987బంగారు పతకంబీహర్ రాష్ట్ర స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్
1988రజత పతకంకోల్ కతా లో జరిగిన జాతీయ స్విమ్మింగ్ కాంపిటీషన్
1988కాంస్య పతకంజాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ - కేరళ
1989రజత పతకంకేరళలోని తిరువనంతపురంలో జరిగిన నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్ షిప్

Next Story