రక్తసిక్తమవుతున్న రహదారులు.. బలవుతున్న వలస కూలీలు

By సుభాష్  Published on  21 May 2020 5:18 AM GMT
రక్తసిక్తమవుతున్న రహదారులు.. బలవుతున్న వలస కూలీలు

ముఖ్యాంశాలు

  • నిర్లక్ష్యానికి ఎందరో అమాయకులు బలి

  • పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

వారంతా వలస కూలీలు..రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. రోజు కూలీ పని చేస్తేనే వారికి నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లేది. లేదంటే పస్తులుండాల్సిందే. అలాంటిది వారిని మృత్యువు వెంటాడింది. లాక్‌డౌన్‌ కారణంగా స్వస్థలాలకు వెళ్లేందుకు పయనమవుతున్న వలస బతుకులకు రోడ్డు ప్రమాదంలో చావుదెబ్బ కొట్టింది. కానరాని లోకాలకు తీసుకెళ్లింది. లాక్‌డౌన్‌ కారణంగా వాళ్ల పరిస్థితి దారుణంగా తయారై వెలుగులు లేకుండా ఉంటే.. ఇక శాశ్వతంగా లేకుండా చేసేంది రోడ్డు ప్రమాదం.

ఈ హృదయవిదారకరమమైన ఘటన అందరిని కలచివేస్తోంది. రోడ్డు ప్రమాదాలతో రక్తమోడుతున్నాయి. దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా ప్రమాదాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోలేవు. ఇటీవల కేంద్రం లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వడంతో మళ్లీ మొదలయ్యాయి. అయితే ఈ ప్రమాదాల్లో అధిక శాతం వలస కూలీలే బలయ్యారు. లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడే చిక్కికుపోయిన వలస కూలీలకు రోడ్డు ప్రమాదాలు శాపంగా మారాయి.

గడిచిన వారం రోజుల్లోనే రోడ్డు ప్రమాదాల వల్ల 100 మందికిపైగా బలయ్యారు. ముందే పనులు లేక, తినేందుకు తిండి లేక నానా అవస్థలు పడుతుంటే మాయదారి రోగం వల్ల వలస కూలీల బతుకులు చిన్నాభిన్నంగా మారాయి. స్వస్థలాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేక కొందరు కాలినడకన వెళ్తుంటే నడిచి నడిచి కాళ్లకు కాయలు కాసి తీవ్ర కష్టాలను చవిచూడాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించి వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో వారు ఇతర రవాణా సౌకర్యం ద్వారా బయలుదేరుతుంటే మృత్యువును వెంటాడింది. అలసిసొలసిన బతుకులకు మృత్యువు కూపంగా మారింది. రోడ్డు ప్రమాదాల వల్ల ఎందరో అమాయక ప్రజలు బలయ్యారు. ఇటీవల కాలినడకన నడుచుకుంటూ వెళ్తున్న కూలీలు అలసిపోయి ఖాళీగా ఉన్న ఔరంగాబాద్‌ రైలు పట్టాలపై నిద్రిస్తుండగా, గుడ్స్‌ రైలు వాళ్లపై దూసుకెళ్లడంతో 19 మంది మృత్యువాత పడ్డారు. మరెందరో కూలీలు ఆస్పత్రి పాలయ్యారు. అలాగే గత వారం రోజుల్లో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అందులో ఎక్కువగా బలైంది వలస కూలీలే.

మధ్యప్రదేశ్‌లో..

ఈనెల 10వ తేదీన మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. హైదరాబాద్‌ నుంచి ఆగ్రాకు మామిడిపళ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కు పఠా రోడ్‌ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ట్రక్కులో మొత్తం 16 మంది కూలీలున్నారు.

కామారెడ్డి జిల్లాలో..

ఈనెల 12న కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా వలస కూలీలే. వీరిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్‌ మండలం దగ్గి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై వ్యాన్‌ టైర్‌ పగిలి బోల్తాపడింది.

ప్రకాశం జిల్లాలో..

ఇటీవల ప్రకాశం జిల్లాలో్ వ్యవసాయ పనులు ముగించుకుని ట్రాక్టర్లో వెళ్తున్న వలస కూలీల్లో 11 మంది మృతి చెందారు. ట్రాక్టర్‌ విద్యుత్‌ స్తంభానికి ఢీకొనడంతో కరెంటు తీగలు తెగిపడి కూలీలపై పడటంతో ఎక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, మిగతావారు పురుషులున్నారు.

అలాగే మంచిర్యాలలోని మందమర్రిలో ద్విచక్ర వాహనంపై వెళ్ఉతన్నముగ్గురు గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు లక్షెట్టిపేటకు చెందిన సుజాత (35), కావ్య (19), మరొకరు బెల్లంపల్లి మండలం పెరకపల్లికి చెందిన కొమురయ్యగా గుర్తించారు.

యూపీలో 23 మంది వలస కూలీలు బలి

ఈనెల 16న ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 23 మంది వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం యూపీలోని ఔరాయ జాతీయ రహదారిపై జరిగింది. వలస కూలీలు వెళ్తున్న ట్రక్కు రాజస్థాన్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్తోంది. క్షతగాత్రులను పోలీసులు చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

నిజామాబాద్‌ జిల్లాలో..

ఈనెల 16న నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం నాకతండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్‌ను స్కార్పియో వాహనం ఢీకొడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. స్కార్పియో వాహనంలో బీహార్‌ నుంచి కేరళలోని కోజికోడ్‌ ప్రాంతానికి బయలుదేరారు. ఈ క్రమంలో డిచ్‌పల్లి నాక తండా వద్దకు రాగానే ఆగివున్న టిప్పర్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్నవారిలో ముగ్గురు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన

స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారు అనేష్‌ (30), స్టాలిన్‌ (22), అనాలియా (16) గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నిర్మల్‌ జిల్లాలో..

ఇక ఇదే రోజు నిర్మల్‌ జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వలస కూలీలతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 49 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా కొండాపూర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మేడ్చల్‌ నుంచి వలస కూలీలు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిర్మల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

బీహార్‌లో..

ఈనెల 19న బీహార్‌ రాష్ట్రంలోని బగల్‌పూర్‌లోని నౌగచియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది వలస కూలీలు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు-లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వలస కూలీలతో వెళ్తున్న లారీ అదుపుతప్ప బస్సునుఢీకొట్టింది. దీంతో లారీ రోడ్డుపక్కన పడిపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఉత్తరప్రదేశ్‌లో..

ఈనెల 20వ తేదీన ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు రైతులు మృత్యువాత పడ్డారు. ఏటావా నుంచి కొంత మంది రైతులు జాక్‌ఫూట్‌ పండ్లను ట్రక్కులో మార్కెట్‌కు తీసుళ్తుండగా, ప్రయాణిస్తున్న ట్రక్కు మరో ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది. ప్రమాదం జరగడంతో కొంతసేపు ఇతర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తర్వాత పోలీసులు ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇక తాజాగా గురువారం నల్గొండ జిల్లా చిట్కాల శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జాతీయ రహదారిపై ఆగివున్న లారీని కారు అదుపుతప్పి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. మృతులు రాజమండ్రి సమీపంలోని కొత్తపల్లికి చెందిన వారుగా గుర్తించారు.

కొత్తపల్లి నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇలా వారం పది రోజుల్లో ఎంతో మంది ప్రాణాలు వదిలారు. అధికారులు, పోలీసులు రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఎన్నో చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం ఆగడం లేదు. అతివేగంగా వాహనాలు నడపం, మద్యం సేవించడం, అజాగ్రత్తగా నడపడం వల్ల ఎందరో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

Next Story
Share it