అక్టోబరు నాటికి రోజుకు లక్ష కేసులు ఖాయమట

By సుభాష్  Published on  7 Sep 2020 5:34 AM GMT
అక్టోబరు నాటికి రోజుకు లక్ష కేసులు ఖాయమట

క్యాలెండర్ లో తేదీలు మారుతున్నాయి. అందుకు తగ్గట్లే దేశంలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఒకప్పుడు లక్ష పాజిటివ్ కేసులు నమోదు కావటానికి నెలలు పట్టిన పరిస్థితి. ఆ తర్వాత అది కాస్తా వారాలకు వారాలు తీసుకునే వరకు వెళ్లగా.. ఇప్పుడు మరింత దూకుడు పెరిగింది. ఇప్పుడు సాగుతున్న తీరులోనే సాగితే.. రానున్న కొద్ది రోజుల్లోనే.. రోజుకు లక్ష కేసులు నమోదయ్యే దారుణ పరిస్థితి దేశంలో ఏర్పడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా దెబ్బకు.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ ఆగమాగం అవుతున్నారు. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో రెండో స్థానాన్ని భారత్ ఆక్రమించటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రానున్న కొద్ది రోజుల్లోనే రోజుకు లక్ష కొత్త కేసులు నమోదు కావటం ఖాయమంటున్నారు. కరోనా భయంతో అన్ లాక్ విధించి.. వారాల తరబడి ఆంక్షల్ని విధించిన కేంద్రం.. తర్వాత అన్ లాక్ పేరుతో లాకులు ఎత్తేయటం తెలిసిందే.

రోజులు గడిచే కొద్దీ.. అన్ లాక్ జాబితాలోకి మరిన్ని సేవల్ని అందుబాటులోకి తెస్తున్న కేంద్రం పుణ్యమా అని.. కేసుల తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే పడకేసిన ఆర్థిక వ్యవస్థను భరించే శక్తి దేశానికి లేకపోవటంతో.. కరోనాతో కలిసి ట్రావెల్ చేయటం మినహా చేయగలిగింది ఏమీ లేదన్న భావనకు వచ్చేసినట్లు చెప్పాలి. ఈ కారణంతోనే.. మొన్నటివరకు రోజుకు ఆరవై వేల కేసులు నమోదయ్యే స్థాయి నుంచి ఇప్పుడు రోజుకు 90వేల కేసులు కొత్తగా నమోదువుతన్నాయి.

అన్ లాక్ లో భాగంగా ఈ రోజు నుంచి దేశ వ్యాప్తంగా మెట్రో రైళ్లు షురూ కావటంతో పాటు.. మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్న నేపథ్యంలో.. రోజుకు లక్ష కేసులు నమోదు కావటం ఖాయమంటున్నారు. అదే జరిగితే.. ప్రపంచ దేశాల్లో కరోనా కేసుల నమోదులో నెంబర్ వన్ స్థానాన్ని భారత్ సొంతం చేసుకోవటం త్వరలోనే చోటు చేసుకోనున్నట్లుగా చెప్పాలి. అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నా.. మరణాల రేటు తక్కువగా ఉండటం ఉపశమనాన్ని కలిగిస్తోంది.

ఇప్పటివరకు అత్యధిక కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తాజాగా రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ ను భారత్ దాటేయటం తెలిసిందే. అంతకంతకూ అన్ లాక్ నిర్ణయాలు తీసుకుంటున్నకేంద్ర.. రాష్ట్రాల కారణంగా కేసుల నమోదు మరింత పెరగటం ఖాయం. ఈ నెలఖరు నాటికి రోజుకు లక్ష కేసులు నమోదయ్యే దరిద్రపుగొట్టు రికార్డు భారత్ సొంతమవుతుందని చెబుతున్నారు.

Next Story
Share it