నిర‌స‌న‌కారుల‌ను నిల్చోబెట్టిన జాతీయ‌గీతం..!

By Newsmeter.Network
Published on : 20 Dec 2019 6:49 PM IST

నిర‌స‌న‌కారుల‌ను నిల్చోబెట్టిన జాతీయ‌గీతం..!

దేశ వ్యాప్తంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నవిష‌యం తెలిసిందే. కర్ణాటక రాజధాని బెంగుళూరులో కూడా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వందల సంఖ్యలో నిరస‌నకారులు నగరంలోని టౌన్ షిప్ వద్దకు వచ్చి పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆదోళనలు చేశారు. ఆదోళనకారులను అదుపు చేయడానికి పోలీసు బలగాలు కూడా అక్కడకు చేరుకున్నాయి. ఈ క్రమంలో బెంగుళూర్ సెంట్ర‌ల్ డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ నిరసనకారులను నియంత్రించేందుకు ఎన్నిరకాల ప్రయత్నాలు చేసిన ఆందోళ‌న‌లు ఆపలేదు.

నిరసనకారులను ఉద్దేశించి డీసీపీ రాథోడ్ మాట్లాడుతూ... దేశంలోని కొన్ని అసాంఘిక శక్తులు వారి స్వలాభం కోసం ఇలాంటి ఆందోళన చర్యలు సాగిస్తున్నాయని.. వీటి వలన సామాన్య‌ ప్రజలు ఇబ్బందులు పడతున్నార‌ని తెలిపారు. అయినా కూడా ఆదోళనకారులు నిరసనలను కొనసాగిస్తూనే ఉన్నారని అన్నారు. ఈ క్రమంలో నిరసనకారులను అదుపు చేయడం కోసం రాథోడ్ వెంటనే 'జన గణ మన' అంటూ జాతీయ గీతం ఆలపించారు. జాతీయ గీతం విన్న వెంట‌నే కూర్చున్నఆందోళనకారులు నిలబడి డీసీపీతో పాటుగా జాతీయ‌ గీతాన్ని ఆలపించారు.

అనంతరం ఆందోళనకారులు అందరు కూడా ఆ ప్రదేశం నుండి చాలా ప్రశాంతంగా వెళ్లిపోయారు. దీనికి సంబందించిన వీడియోను డీజీపీ హేమంత్ నింబాల్కర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనితో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



Next Story