మెట్రో ట్రాక్‌పై నుంచి దూకేందుకు యువతి యత్నం.. చివరకు..

ఈ మధ్యకాలంలో యువత చిన్నచిన్న కారణాలకే బలవన్మరణానికి పాల్పడుతున్నారు.

By Srikanth Gundamalla
Published on : 12 Dec 2023 10:35 AM IST

young lady, suicide attempt,  delhi metro, railway track,

మెట్రో ట్రాక్‌పై నుంచి దూకేందుకు యువతి యత్నం.. చివరకు..

ఈ మధ్యకాలంలో యువత చిన్నచిన్న కారణాలకే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అయితే.. మార్కులు తక్కువ వచ్చాయని.. ఇంట్లో తిట్టారని.. అడిగింది కొనివ్వలేదని.. లవ్‌లో ఫెయిల్‌ అయ్యామని ఇలా వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు గుండెకోత మిగులుస్తున్నారు. అయితే.. ఢిల్లీలో కూడా ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. కారణమేంటో తెలియదు కానీ.. ఏకంగా మెట్రో రైల్‌ ట్రాక్‌ పైనుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించింది.

దేశ రాజధాని ఢిల్లీలోని షాదీపూర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఈ సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. చేతిలో మొబైల్ ఫోన్‌ పట్టుకున్న ఓ యువతి ఉన్నట్లుండి మెట్రో రైల్‌ ట్రాక్‌పైకి వచ్చింది. ఆ తర్వాత ట్రాక్‌ రేలింగ్‌ ఎక్కి కిందకు దూకాలని చూసింది. మెట్రో రైల్‌ ట్రాక్‌ ఎంత ఎత్తులో ఉంటుందో అందరికీ తెలిసిందే. అక్కడ నుంచి కిందకు దూకితే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. సదురు యువతి మెట్రో రైల్వే ట్రాక్‌ రేలింగ్‌ ఎక్కడాన్ని కింద ఉన్నవారు గమనించారు. వద్దు వెనక్కి వెళ్లు కిందకు దూకొద్దంటూ పెద్దగా అరుస్తూ ఆమెను వారించారు. అయితే.. యువతి మాత్రం ఏమాత్రం వినకుండా అలాగే అక్కడే నిలబడి కిందకు చూసింది. చివరకు మెట్రో రైల్ అధికారులు ట్రాక్‌పైకి వచ్చారు. ఆమె వద్దకు చేరుకుని చుట్టుగా వచ్చి పట్టుకున్నారు. కిందకు దూకకుండా ఆపగలిగారు.

ఆ యువతిని క్షేమంగా కాపాడటంతో అక్కడున్నవారంతా ఊపిరితీసుకున్నారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. కేసు నమోదు చేసుకున్నామని వెల్లడించారు. అసలు యువతి మెట్రో ట్రాక్‌పైకి ఎలా వెళ్లింది..? ఎందుకు వెళ్లింది..? కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుందా..? ఇలా అన్నింటి గురించి దర్యాప్తులో విచారిస్తామని పోలీసులు తెలిపారు.


Next Story