మహిళా రెజ్లర్లపై వేధింపుల కేసులో బీజేపీ ఎంపీ బెయిల్‌పై విడుదల
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బెయిల్‌పై విడుదలయ్యారు.
By News Meter Telugu Published on 18 July 2023 6:30 PM ISTమహిళా రెజ్లర్లపై వేధింపుల కేసులో బీజేపీ ఎంపీ బెయిల్‌పై విడుదల
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో భారతీయ జనతా పార్టీ ఎంపీ, WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బెయిల్‌పై విడుదలయ్యారు. ఢిల్లీలోని స్థానిక రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం రూ.25000 పూచీకత్తుతో 2 రోజులకు మధ్యంతర బెయిల్ కు అనుమతించింది. ఇదే కేసుకు సంబంధించి ఎంపీకి సహకరించారన్న ఆరోపణల కేసులో WFI అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌కి కూడా మధ్యంతర బెయిల్ లభించింది. సాధారణ బెయిల్ పిటిషన్‌పై గురువారం నుంచి వాదనలు జరగనున్నాయి. ఈ కేసుకు సంబంధించి రిపోర్టింగ్ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీడియాను న్యాయస్థానం కోరింది. న్యాయమూర్తుల వ్యాఖ్యలు అపార్తాలు వచ్చేట్లు ప్రచురించవద్దని.. రిపోర్టింగ్ సరిగా చేయకుంటే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అలా చేసే వాళ్లపై కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని హెచ్చరించింది.
మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ పై ఏప్రిల్ నెలలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ కేసులో జూన్ 2న ఢిల్లీ పోలీసులు 2 ఎఫ్ఐఆర్(FIR)లు, 10 ఫిర్యాదులను స్వీకరించారు. అసభ్యకరంగా రెజ్లర్లను తాకడం వంటి తీవ్రమైన ఆరోపణలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫోటో, వీడియో, కాల్ వివరాలు వంటి సాక్ష్యాధారాలతో జూన్ 15న బ్రిజ్ భూషణ్‌పై 1500 పేజీల ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. IPC 354 సెక్షన్, సెక్షన్ 354A, సెక్షన్ 354D, సెక్షన్ 504 కింద కేసులు నమోదు చేశారు.