చిరుతల వరుస మరణాలు.. నిపుణులు ఏమంటున్నారంటే?
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్లో ఇటీవల చిరుతలు చనిపోతూ ఉండడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది.
By News Meter Telugu Published on 18 July 2023 9:15 PM ISTచిరుతల వరుస మరణాలు.. నిపుణులు ఏమంటున్నారంటే?
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (కెఎన్‌పి)లో ఇటీవల చిరుతలు చనిపోతూ ఉండడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. అన్ని రేడియో కాలర్ ఫ్రీ-రేంజ్ చిరుతలను నిశితంగా పరిశీలించడానికి వాటి ఎన్‌క్లోజర్‌లకు తిరిగి తీసుకురావాలని భావిస్తున్నారు. అడవిలో వాటి కదలికలను పర్యవేక్షించడానికి డ్రోన్‌లను ఉపయోగించాలని అధికారులు పరిశీలిస్తున్నారు.
చీతా ప్రాజెక్ట్ లో భాగంగా తీసుకుని వచ్చిన చీతాలు చనిపోవడానికి కారణం రేడియో కాలర్‌స్ కూడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేడియో కాలర్స్ వల్ల సంభవించే ఇన్‌ఫెక్షన్ల వల్ల మరణాలు సంభవించే అవకాశం లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు.
జూలై 14న కూడా ఒక చీతా మరణం సంభవించింది. సూరజ్ అనే మగ చిరుతను ఆఫ్రికా నుండి KNPకి తీసుకుని వచ్చారు. పాల్పూర్ ఈస్ట్ ఫారెస్ట్ రేంజ్‌లోని మసవాని బీట్‌లో మరణించినట్లు మానిటరింగ్ టీమ్ కనుగొంది. వారు దగ్గరగా వెళ్ళినప్పుడు సూరజ్ మెడపై పురుగులు ఉన్నట్లు గుర్తించారు. దగ్గరకు వెళ్లగా అది లేచి పారిపోయింది. ఆ తర్వాత చనిపోయి కనిపించింది.
జూలై 11న మరో మరణం నమోదైంది. ఎన్‌క్లోజర్ నంబర్ 6లో నాలుగేళ్ల తేజస్ మృతి చెందినట్లు పర్యవేక్షణ బృందం గుర్తించింది. మెడపై గాయం గుర్తులను గుర్తించారు. ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటివరకు ఎనిమిది చిరుతలు చనిపోయాయి. నేషనల్ పార్క్‌లో మొత్తం చీతాల సంఖ్య ఇప్పుడు 17కి పడిపోయింది.
చీతాలను పరిచయం చేసే ప్రయత్నం
ప్రాజెక్ట్ చీతా కింద, నమీబియా, దక్షిణాఫ్రికా నుండి KNPకి మొత్తం 20 రేడియో కాలర్ చీతాలను తీసుకుని వచ్చారు. ఈ ప్రాజెక్ట్ 1952లో భారతదేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నంలో భాగం. భారతదేశంలోని చివరి చీతా 1947లో ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో మరణించింది. తరువాత ఈ జాతి అంతరించిపోయినట్లు ప్రకటించారు.
సెప్టెంబరు 2022లో, మధ్యప్రదేశ్‌లోని KNPలో ఎనిమిది నమీబియా చిరుతలు, ఐదు ఆడ, మూడు మగ చిరుతలతో కూడిన మొదటి బ్యాచ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఫిబ్రవరి 2023లో, దక్షిణాఫ్రికా నుండి 12 చిరుతలు తీసుకుని వచ్చారు. ఫిబ్రవరి 18న కునోలోకి విడుదల చేశారు. జూలై నాటికి, 12 చిరుతలను ఫ్రీ రేంజ్‌లో విడుదల చేశారు. చిరుతలను పెద్ద అక్లిమటైజేషన్ ఎన్‌క్లోజర్‌లకు తరలించారు. ప్రస్తుతం, 11 చిరుతలు స్వేచ్చగా తిరుగుతూ ఉండగా.. భారతదేశంలో జన్మించిన ఒక పిల్లతో సహా ఐదు ఎన్‌క్లోజర్‌లో ఉన్నాయి. ప్రతి చిరుతను ప్రత్యేక బృందాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
రేడియో కాలర్‌ల కారణంగా మరణాలు కేవలం ఊహాగానాలు మాత్రమే:
అటవీ అధికారులు చిరుతల కదలికలను ట్రాక్ చేయడానికి రేడియో కాలర్‌లపై శాటిలైట్ ట్రాన్స్‌మిటర్‌లను ఉపయోగిస్తారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) రేడియో కాలర్ కారణంగా ఈ మరణాలు సంభవిస్తూ ఉన్నాయనే నివేదికలను కొట్టివేశాయి. కేవలం ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేశారు. వీటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. ఇటీవల చనిపోయిన రెండు చిరుతల మరణాలకు సంబంధించి రెండింటి మెడపై గాయాలు ఉన్నాయనేది పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషిస్తున్న కొందరు నిపుణులు రేడియో కాలర్ వాడకం వల్ల సంభవించిన ఇన్‌ఫెక్షన్ కారణంగా దక్షిణాఫ్రికాకు చెందిన ఒక మగ చిరుత చనిపోయిందని అంగీకరించారు.
KNPని సందర్శించిన ఆఫ్రికన్ నిపుణులు
చీతా ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఒక అధికారి మాట్లాడుతూ, “అన్ని రేడియో-కాలర్ చిరుతలను దగ్గరగా పర్యవేక్షించడం కోసం వాటి ఎన్‌క్లోజర్‌లకు తిరిగి తీసుకురావాలి. చిరుతలకు సంబంధించిన వివరాలు, చికిత్సపై అవసరమైన సహాయాన్ని అందించడానికి దక్షిణాఫ్రికా నుండి నిపుణులు KNPకి వచ్చారని అధికారి తెలిపారు.
ఈ సమావేశంలో వర్షాకాలంలో చీతాల పరిస్థితి, కొండ ప్రాంతాలలో లేదా చల్లని వాతావరణంలో చిరుతలను పర్యవేక్షించడానికి రేడియో కాలర్‌లకు అనుసంధానించబడిన డ్రోన్‌ల వినియోగం గురించి కూడా చర్చించారు. చిరుత మరణాలపై దర్యాప్తు, ప్రణాళికాబద్ధమైన చర్యలు, సంబంధిత వివరాల గురించి తెలియజేయాలని దక్షిణాఫ్రికా నిపుణులు భారత ప్రభుత్వాన్ని కోరారు.
అడవిలో జంతువులను విడుదల చేసిన మొదటి సంవత్సరంలోనే వ్యవస్థాపక జనాభాలో 50 శాతం నష్టం ఆమోదయోగ్యమైన ప్రమాణాలలో ఉందని చీతా ప్రాజెక్టులో పాల్గొన్న వారిలో ఒకరు కమిటీకి తెలిపారు. దక్షిణాఫ్రికాలో రేడియో కాలర్ సంబంధిత సమస్య ఏదీ ఎదురుకాలేదని, అలాంటి మరణాలను నివారించడానికి వినూత్న చర్యలు అవసరమని నిపుణులు తెలిపారు.
సెప్టిసిమియా వల్ల మరణాలు సంభవించవచ్చు
మరణాలకు కాలర్లే కారణమని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. చీతా ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ అధినేత రాజేష్ గోపాల్ మాట్లాడుతూ చిరుతలు చనిపోవడానికి రేడియో కాలర్ వాడకం వల్ల వచ్చే సెప్టిసిమియా కారణమని చెప్పారు. "ఇది చాలా అసాధారణమైనది. ఇది ఆందోళన కలిగించే అంశం. మేము చిరుతలను అన్నింటిని తనిఖీ చేయమని (మధ్యప్రదేశ్ అటవీ శాఖ సిబ్బందిని) ఆదేశించాము, ”అని ఆయన చెప్పారు. దక్షిణాఫ్రికా చిరుత మెటాపోపులేషన్ నిపుణుడు విన్సెంట్ వాన్ డెర్ మెర్వే మాట్లాడుతూ, తడి పరిస్థితులు రేడియో కాలర్ ఇన్‌ఫెక్షన్‌ని సృష్టించడానికి కారణమవుతున్నాయని, బహుశా చిరుతల మరణానికి కారణం ఇదే అయి ఉండొచ్చని చెప్పారు.
25 సంవత్సరాలుగా వాడుకలో కాలర్లు
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా కాలర్‌లను ఉపయోగించడం భారతదేశంలో సుమారు 25 సంవత్సరాలుగా ఉంది. కానీ అలాంటి ఇన్ఫెక్షన్ తాలూకు సంఘటన తమకు ఎప్పుడూ ఎదురుకాలేదు. “ఈ రోజుల్లో మంచి, స్మార్ట్ కాలర్లు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరిగితే తయారీదారుల దృష్టికి తీసుకువెళ్ళాలి’’ అని రాజేష్ గోపాల్ అన్నారు.
చీతాలు కునోలో ఉంటాయి
మంత్రిత్వ శాఖ ప్రకారం, చీతా ప్రాజెక్ట్ ఇంకా పురోగతిలో ఉంది. ఒక సంవత్సరం లోపు దాని విజయం లేదా వైఫల్యాన్ని అంచనా వేయడం కరెక్ట్ కాదని తెలిపారు. రెస్క్యూ, పునరావాసం, సామర్థ్యాన్ని పెంపొందించే సౌకర్యాలతో చేతా పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో సహా చీతా ప్రాజెక్టుకు మద్దతుగా అనేక దశలను ప్లాన్ చేసినట్లు తెలిపారు. ల్యాండ్‌స్కేప్-స్థాయి నిర్వహణ కోసం మరిన్ని అటవీ ప్రాంతాలు KNP పరిపాలనా నియంత్రణలోకి తీసుకురానున్నారు.
మధ్యప్రదేశ్‌లోని గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో అదనపు ఫ్రంట్‌లైన్ సిబ్బందిని మోహరించి, చీతా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని, చిరుతలకు సెకండ్ హోమ్ ను ఏర్పాటు చేస్తామని మినిస్ట్రీ తెలిపింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ లో చిరుతలు ఉంటాయని ప్రాజెక్ట్ ఖచ్చితంగా విజయవంతం అవుతుందని చెప్పారు. “మేము అంతర్జాతీయ నిపుణులతో టచ్‌లో ఉన్నాము. చిరుతలను తరలించడం లేదు.. అవి కునోలో మాత్రమే ఉంటుంది, ”అని మంత్రి చెప్పారు.