ఎగ్జిట్‌పోల్స్‌ తలకిందులు.. బెంగాల్‌లో టీఎంసీ హవా

దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  4 Jun 2024 11:16 AM IST
west bengal, trinamool congress,  elction results,

ఎగ్జిట్‌పోల్స్‌ తలకిందులు.. బెంగాల్‌లో టీఎంసీ హవా 

దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను.. తాజాగా ఈసీ అధికారికంగా విడుదల చేస్తున్న ఫలితాలను బేరీజు వేస్తున్నారు పలువురు నిపుణులు. అన్ని చోట్లా ఏమో కానీ.. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ తారుమారు అయ్యాయి. వెస్ట్‌ బెంగాల్‌లో అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌కే రాష్ట్ర ప్రజలు మద్దతు పలికారు. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే.. ప్రస్తుతం ఎన్నికల సంఘం అధికారికంగా తెలుపుతున్న వివరాల ప్రకారం.. తృణమూల్‌ కాంగ్రెస్‌ 25 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. అంటే మెజారిటీ స్థానాలు మమతా బెనర్జీ పార్టీలో ఖాతాలోనే పడనున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ 10 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతుంటే.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక సీపీఐ-ఎంకు చెందిన అభ్యర్థి ఒకస్థానంలో లీడింగ్‌లో ఉన్నారు.

కాగా.. ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం చూసినట్లు అయితే.. వెస్ట్‌ బెంగాల్‌లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుస్తుందని తెలిపాయి. ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్స్ ప్రకారం బీజేపీ 26-31 స్థానాల్లో గెలుస్తుందని తెలిపింది. టీఎంసీ 11-14 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అయితే.. తాజాగా వెల్లడవుతున్న ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌ను తలకిందులు చేశాయి. తృణమూల్ కాంగ్రెస్‌ తన హవాను కొనసాగిస్తోంది.

మరోవైపు గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించగా.. 22 స్థానాల్లో టీఎంసీ గెలిచింది. ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మవద్దనీ.. అవి కచ్చితంగా తారుమారు అవుతాయని ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. ఇప్పుడామె చెప్పిందే నిజం అవుతోంది. గతంలో కంటే ఎక్కువ సీట్లను టీఎంసీ సొంతం చేసుకోబుతున్నట్లు అర్థం అవుతోంది.

Next Story