బెంగాల్‌లో మరో ఘటన, ఇద్దరు మహిళలను అర్ధనగ్నంగా ఊరేగింపు

మణిపూర్‌ ఘటన మరవకముందే బెంగాల్‌లో ఇదే తరహాలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

By Srikanth Gundamalla  Published on  22 July 2023 12:59 PM IST
West Bengal,  two women, half-naked,

బెంగాల్‌లో మరో ఘటన, ఇద్దరు మహిళలను అర్ధనగ్నంగా ఊరేగింపు

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశ మొత్తాన్ని కలచివేసింది. ఈ ఘటన మరవకముందే బెంగాల్‌లో ఇదే తరహాలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. మల్దాలోని పకువాహాట్‌లో ఇద్దరు మహిళలు దొంగతనం చేశారనే అనుమానంతో స్థానిక మహిళలు దారుణంగా ప్రవర్తించారు. బట్టలు విప్పించి కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మణిపూర్‌ ఘటన మరవకుముందే.. బెంగాల్‌లో ఇలాంటి ఘటన వెలుగు చూడటం కలవరపెడుతోంది. అమానవీయంగా ప్రవర్తించారంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

కాగా.. ఈ సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. వీడియో తమ దృష్టికి వచ్చిన తర్వాతే తమకూ విషయం తెలిసిందని చెబుతున్నారు పోలీసులు. తమ ప్రాథమిక విచారణలో ఇద్దరు మహిళలు దొంగతనానికి పాల్పడుతుండగా.. స్థానిక వ్యాపారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారని చెప్తున్నారు. ఆ తర్వాత ఇద్దరినీ పట్టుకుని స్థానిక మహిళలు అందరి ముందే వారి బట్టలు విప్పించి కొట్టారని చెప్పారు. ఈ ఘటన నుంచి ఎలాగోలా ఇద్దరు బాధిత మహిళలు తప్పించుకున్నారు. ఆ తర్వాత దాడికి పాల్పడ్డ వారు కూడా భయంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని పోలీసులు వివరించారు. బాధిత మహిళల ఆచూకీ కూడా తెలియడం లేదని చెప్పారు పోలీసులు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేశామని.. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారు.

పలువరు ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. దొంగతనానికి పాల్పడితే పోలీసులకు అప్పజెప్పాలి ఇలా దారుణంగా వ్యవహరించొద్దని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మరింత వైరల్ అవ్వకుండా అధికారులు తీసేయించాలని కోరుతున్నారు.


Next Story