కోల్‌కతాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం

పశ్చిమ బెంగాల్‌లో ప్రమాదం సంభవించింది. రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది.

By Srikanth Gundamalla  Published on  18 March 2024 11:39 AM IST
west bengal,  building collapse, two dead,

కోల్‌కతాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం

పశ్చిమ బెంగాల్‌లో ప్రమాదం సంభవించింది. రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చిక్కుకున్న 13 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. మరికొందరు కూడా శిథిలాల కింద చిక్కుకుని ఉన్నట్లు పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక గార్డెన్ రీచ్‌ ప్రాంతంలోని ఓ కాలనీలో ఈ ప్రమాదం సంభవించింది.

గాయపడ్డ వారిని పోలీసులు, సహాయక సిబ్బంది స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఉదయం రంగంలోకి దిగిన 50 మంది సభ్యలతో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ప్రస్తుతం అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటుంది. ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ లేరని చెబుతున్నారు. అయితే.. ఐదంతస్తుల భవనం పక్కనున్న గుడిసెలపై పడిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. శిథిలాల కింద ఉన్నవారిని బయటకు తీసే పనులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాదంపై పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా సందర్శించారు. సహాయక చర్యల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచించారు. ఇక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.



Next Story