వయనాడ్‌లో లెఫ్ట్‌నెంట్‌ కల్నల్ హోదాలో పర్యటించిన మోహన్‌ లాల్

కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయం సృష్టించింది.

By Srikanth Gundamalla  Published on  3 Aug 2024 8:15 AM GMT
wayanad, landslide incident, mohanlal,

వయనాడ్‌లో లెఫ్ట్‌నెంట్‌ కల్నల్ హోదాలో పర్యటించిన మోహన్‌ లాల్

కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడి.. 350 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఆచూకీ కనిపించడం లేదు. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సంఘటన యావత్ దేశాన్ని కలచి వేసింది. విపత్తులో మరణించిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం అందరినీ విషాదంలో ముంచుతోంది. అయితే.. ఇప్పటికే వయనాడ్‌ లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పలువురు ప్రముఖులు సందర్శించారు. తాజాగా ప్రకృతి విలయంతో అతలాకుతలం అయిన వయనాడ్‌ను లెఫ్టినెంట్‌ కల్నల్ హోదాలో మోహన్‌లాల్ సందర్శించారు. నష్టపోయిన వారికి సాయం చేసేందుకు తన వంతుగా ముందుకు వచ్చారు.

కాగా.. మోహన్‌ లాల్‌ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2008 జూలై 9న అధికారికంగా లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో చేరారు. టెరిటోరియల్ ఆర్మీకి అప్పటి ఆర్మీ చీఫ్ దీపక్ కపూర్ మోహన్‌ లాల్‌కు ఈ హోదాను కల్పించారు. ఈ గౌరవం అందుకున్న తొలి నటుడు మోహన్‌లాల్ కావడం గమనార్హం. 2012లో మోహన్‌లాల్‌కు దక్షిణ కొరియాలోని కుక్కివాన్ నుంచి టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ గౌరవ బిరుదు లభించింది. ఈ బిరుదుతో సత్కరించిన తొలి దక్షిణ భారత నటుడిగా ఆయన రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. ఇక ఇప్పుడు వయనాడ్‌ బాధితులకు సాయం చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు వ్యాపార వేత్తలు కోట్ల రూపాయలను కేరళ సీఎం నిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు. సినిమా సెలబ్రిటీలు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. మోహన్‌ లాల్‌ కేరళ సీఎం సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళంగా కూడా అందించారు. తాజాగా తానే బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి ఆదర్శంగా నిలుస్తున్నారు. మోహన్‌ లాల్‌ వయనాడ్‌కు వచ్చిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Next Story