అయోధ్యలో ఉగ్ర కలకలం, ముగ్గురు అనుమానితుల అరెస్ట్!

అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతోంది.

By Srikanth Gundamalla  Published on  19 Jan 2024 11:45 AM IST
Violent commotion, Ayodhya, three suspects, arrested,

 అయోధ్యలో ఉగ్ర కలకలం, ముగ్గురు అనుమానితుల అరెస్ట్!

అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే వివిధ పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జనవరి 22వ తేదీన మధ్యాహ్నం రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగబోతుంది. ఇప్పటికే ప్రధాన విగ్రహం కూడా గర్భగుడికి చేరుకుంది. అయితే.. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరు అయ్యే ఈ వేడుకకు.. వివిధ దేశాల నుంచి 11వేల మంది వరకు అతిథులు హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రానికి చెందిన భద్రతా బలగాలు అయోధ్యలో ముమ్మరంగా గస్తీ కాస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అయోధ్యలో ఉగ్ర కలకలం రేపింది. ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను ఉత్తర్‌ప్రదేశ్‌ యాంటీ టెర్రరిజమ్‌ స్క్వాడ్‌ పోలీసులు పట్టుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లాలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు అనుమానితులను పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు చెప్పారు. యూపీ స్పెషల్ డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వారు ఏ ఉగ్రగూప్‌నకు చెందినవారు అనేవిషయం తెలియాల్సి ఉందన్నారు. అయితే..ముగ్గురు అనుమానితులను ప్రస్తుతం విచారిస్తున్నట్లు చెప్పారు.

అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భద్రతా బలగాలు గస్తీ కాస్తున్నాయి. భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. అయోధ్య నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలన ఏర్పాటు చేశారు. డ్రోన్‌ కెమెరాల ద్వారా నిత్యం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. అయోధ్యలో ఇప్పటికే 1000కిపైగా మంది ప్రత్యేక పోలీసులు మోహరించారు. అనుమానాస్పద వస్తువులను గుర్తించేలా 4.5 కిలోమీటర్ల పరిధిలో డోమ్ను ఏర్పాటు చేశారు. సెక్యూరిటీలో భాగంగా పోలీసులు, పారామిలటరీ బలగాలు, 100 మంది డీఎస్పీలు, 325 మంది ఇన్‌స్పెక్టర్లు, 800 మంది ఎస్‌ఐలు నిత్యం విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా.. అయోధ్యలో ఈ నెల 22న మధ్యాహ్నం 12.29 గంటలకు రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది.



Next Story