110 కి.మీ వేగంతో వెళ్తున్న రైలు నుంచి పడ్డ వ్యక్తి.. తర్వాత?

ఉత్తర్‌ ప్రదేశ్‌లో 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు నుంచి ఓ వ్యక్తి జారిపడ్డాడు.

By -  Srikanth Gundamalla
Published on : 21 Jun 2023 11:08 AM IST

UP, Man Fell Down, High Speed Train

110 కి.మీ వేగంతో వెళ్తున్న రైలు నుంచి పడ్డ వ్యక్తి.. తర్వాత?

రైళ్లు, బస్సుల్లో కొందరు ప్రయాణికులు నిర్లక్ష్యంగా డోర్ల వద్ద నిలబడుతుంటారు. అలా వెళ్లడం ప్రమాదకరమని చెప్పినా పట్టించుకోరు. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడి తీవ్రగాయాల పాలైతే.. ఇంకొన్ని సార్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. హైస్పీడ్‌తో వెళ్తున్న రైలు నుంచి పడితే..? ఊహించుకోవడానికే భయంగా ఉంది కదా..? ఉత్తర్‌ ప్రదేశ్‌లో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు నుంచి ఓ వ్యక్తి జారిపడ్డాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది ఈ ఘటన. పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. డోర్‌ దగ్గరే నిలబడినట్లు ఉన్నాడు ఓ ప్రయాణికుడు ప్రమాదవశాత్తు జారి ప్లాట్‌ఫాంపై పడ్డాడు. దాంతో ఆ వ్యక్తి దాదాపు 100 మీటర్ల వరకు జారుతూ వెళ్లాడు. అయితే.. రైల్వే స్టేషన్‌లో ఉన్న ఒకరు ట్రైన్‌ను వీడియో తీస్తుండగా ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. అంత వేగంతో వెళ్తున్న రైలు నుంచి పడ్డా కూడా సుదురు వ్యక్తి మళ్లీ లేచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతనికి స్వల్ప గాయాలు మినహా ఏం కాలేదు. ఈ సీన్‌ను చూసిన రైల్వే స్టేషన్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఏం జరగనట్లు ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అతని అదృష్టం బాగుందని.. భూమి పైనా ఇంకా నూకలు ఉన్నాయని అంటున్నారు. కాగా.. ప్రమాదానికి గురైన వ్యక్తి వివరాలు తెలియరాలేదు.

Next Story