యూపీలో ఘోరం..రోడ్డుపై బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు
ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ బీజేపీ నేతను కాల్చి చంపారు దుండగులు.
By Srikanth Gundamalla Published on 11 Aug 2023 1:17 PM ISTయూపీలో ఘోరం..రోడ్డుపై బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు
ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ బీజేపీ నేతను కాల్చి చంపారు దుండగులు. ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ బీజేపీ నేత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దుండగులు జరిపిన కాల్పుల ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ ఘోరం జరిగింది. నడిచి వెళ్తున్న బీజేపీ నేతను కాల్పులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపి చంపారు. అనుజ్ చౌదరి (30) మొరాదాబాద్ పట్టణ బీజేపీ నేతగా ఉన్నారు. ఆగస్టు 10న సాయంత్రం పట్టణంలోని తన నివాసం నుంచి బయటకు వచ్చి మరోవ్యక్తితో కలిసి నడిచి వెళ్తున్నాడు. ఆ క్రమంలోనే బైక్‌పై వచ్చిన దుండగులు వెనకనుంచే కాల్పులు జరిపారు. దాంతో.. అనుజ్ చౌదరి రోడ్డుపై కుప్పకూలిపోయాడు.
దాంతో.. కాల్పులు జరిపిన దుండగులు కాస్త ముందుకు వెళ్లారు. ఏమైందో తెలియదు కానీ.. మళ్లీ వెనక్కి వచ్చి మరోసారి కాల్పులకు తెగబడ్డారు. గన్‌తో దగ్గరగా వచ్చి వరుసగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి బైక్‌పై పరారు అయ్యారు. అనుజ్ చౌదరి నివసించే అపార్ట్‌మెంట్ దగ్గరే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్ధం విన్న స్థానికులు వెంటనే బయటకు వచ్చారు. రక్తపు మడుగులో పడివున్న అనుజ్ చౌదరి చూశారు. వెంటనే పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే అనుజ్ ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులు జరిపిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ఇక అనుజ్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమిత్ చౌదరి, అనికేత్ అనే ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ మీనా ప్రకటించారు. హత్యకు రాజకీయ కక్షలే కారణమని అనుజ్ చౌదరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. ఉత్తర్ ప్రదేశ్‌లో ఇలాంటి కాల్పుల ఘటనలు తరచూ జరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. గన్ కల్చర్ పూర్తిగా అంతమొందించలేకపోతున్నారు. తాజాగా బీజేపీ నేత మృతితో మరోసారి ఆందోళన కలిగిస్తోంది. అనుజ్ చౌదరి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.