యూజీసీ-నెట్ ఎగ్జామ్ కొత్త షెడ్యూల్ విడుదల
తాజాగా ఈ ఎగ్జామ్ కొత్త షెడ్యూల్‌ను కూడా వెల్లడించింది కేంద్ర విద్యాశాఖ.
By Srikanth Gundamalla Published on 29 Jun 2024 7:39 AM ISTయూజీసీ-నెట్ ఎగ్జామ్ కొత్త షెడ్యూల్ విడుదల
యూజీసీ-నెట్ ఎగ్జామ్‌లో అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దాంతో.. విచారణ జరిపిన కేంద్ర విద్యాశాఖ కూడా ఇదే విషయాన్ని గురించింది. దాంతో.. యూజీసీ-నెట్ ఎగ్జామ్‌ను రద్దు చేసింది. ఇక తాజాగా ఈ ఎగ్జామ్ కొత్త షెడ్యూల్‌ను కూడా వెల్లడించింది కేంద్ర విద్యాశాఖ. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 మధ్య పరీక్షలు ఉంటాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారమే ప్రకటన విడుదల చేసింది.
ఆల్ ఇండియా ఆయుష్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్టు 2024 షెడ్యూల్ ప్రకారం జూలై 6వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు అధికారులు. మరోవైపు సీఎస్ఐఆర్ నెట్ పరీక్ష జూలై 25-27 మధ్య జరగనుంది. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల్లో లెక్చర్‌షిప్‌లు, రీసెర్చ్ ఫెలోషిప్‌లు కోరుకునే అభ్యర్థులకు నెట్, సీఎస్ఐఆర్ పరీక్షలు చాలా కీలకమైనవి. ఇప్పటి వరకు పెన్ను, పేపర్ విధానంలో యూజీసీ నెట్ పరీక్షలను నిర్వహించారు. ఇక నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది.
కాగా జూన్ 18న దేశవ్యాప్తంగా రెండు విడతలుగా యూజీసీ-నెట్ ఎగ్జామ్ జరిగింది. అయితే అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడ్డాయి. విద్యార్థి సంఘాల నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. పరీక్షలను సక్రమంగా నిర్వహించకుండా అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపించారు. దాంతో.. పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పరీక్ష జరిగిన మరుసటి రోజే యూటీసీ నెట్ ఎగ్జామ్‌ను రద్దు చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.