డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకు నోటీసులు పంపారు. తనపై నిరాధారమైన, పరువుకు నష్టం కలిగేలా ఆరోపణలు చేశారంటూ అన్నామలైకు ఉదయనిధి నోటీసులు పంపారు. అన్నామలై ఇటీవల ‘డీఎంకే ఫైల్స్’ పేరుతో ఒక వీడియోను విడుదల చేశారు. అందులో సీఎం కుమారుడు అయిన మంత్రి ఉదయనిధికి 2,039 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉదయనిధి తరఫున సీనియర్ న్యాయవాది పి.విల్సన్ ద్వారా అన్నామలైకు నోటీసులు పంపారు. 48 గంటల్లో అన్నామలై క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో 50 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని కోరుతూ కేసు దాఖలు చేస్తామని మంత్రి ఉదయనిధి హెచ్చరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం అన్నామలై మీద 500 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. తమ ప్రభుత్వం మీద నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేసినందుకు ఈ దావా వేసినట్లు తెలిపారు.