బెదిరింపులు కొత్తేమికాదు..రూ.10 కోట్లు అవసరం లేదు: ఉదయనిధి
స్వామీజీ బెదిరింపులపై మంత్రి ఉదయనిధి స్థాలిన్ స్పందించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పుకొచ్చారు.
By Srikanth Gundamalla Published on 5 Sept 2023 1:13 PM ISTబెదిరింపులు కొత్తేమికాదు..రూ.10 కోట్లు అవసరం లేదు: ఉదయనిధి
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన కామెంట్స్‌పై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ క్రమంలోనే ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ స్వామిజీ ఉదయనిధి స్టాలిన్‌పై బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్ తలపై రూ.10 కోట్ల రివార్డు ప్రకటించారు. ఒక వేళ ఆ పని ఎవరూ చేయడానికి ముందుకు రాకపోతే.. తానే చేస్తానని బెందిరింపులకు పాల్పడ్డారు స్వామీజీ.
తాజాగా.. స్వామీజీ బెదిరింపులపై మంత్రి ఉదయనిధి స్థాలిన్ స్పందించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పుకొచ్చారు. బెదిరింపులకు పాల్పడ్డ స్వామీజికి కౌంటర్ కూడా ఇచ్చారు ఉదయనిధి. తన తల కోసం రూ.10 కోట్ల రివార్డు ప్రకటించాల్సిన అవసరం లేదని అన్నాడు. తన తల దువ్వుకునేందుకు పది రూపాయల దువ్వెన సరిపోతుందని అన్నాడు. తన తల కోసం అంత వెచ్చించాల్సిన అవసరం లేదంటూ కౌంటర్ ఇచ్చాడు. అయితే.. ఇలాంటి బెదిరింపులు తనకు కొత్తేమీ కాదని అన్నారు ఉదయనిధి స్టాలిన్. ఇలాంటి వార్నింగ్‌లకు తాను భయపడనని చెప్పారు. తమిళనాడు ప్రజల జీవితాల కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన కరుణానిధి మనవడిని అని చెప్పుకొచ్చారు.
దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్నా కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ఆపేదే లేదని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. అందరికీ అన్నీ దక్కాలన్నదే ద్రావిడ మోడల్ ఉద్దేశమని చెప్పారు. ఈ వ్యవహారంలో తనపై ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలో బీజేపీ నాయకులు, డీఎంకే నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల చెన్నైలో ఓ కార్యక్రమానికి మాజరైన ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మం డెంగీ, మలేయిరా, కరోనాల లాంటిదని అన్నాడు. దాన్ని వ్యతిరేకించలేమని, నిర్మూలించాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయానికి సనాతన ధర్మం విరుద్ధమని చెప్పుకొచ్చారు ఉదయనిధి స్టాలిన్.