తప్పిపోయిన ఇద్దరు వృద్ధులను గూగుల్‌ సెర్చ్‌ ద్వారా ఇళ్లకు చేర్చిన స్వచ్ఛంద సంస్థ

తమ ఇళ్ల నుండి తప్పిపోయిన ఇద్దరు సీనియర్ సిటిజన్‌లను గూగుల్ సెర్చ్‌ ద్వారా ఇళ్లకు చేర్చింది ఒక సంస్థ

By Srikanth Gundamalla  Published on  17 Sept 2024 4:47 PM IST
తప్పిపోయిన ఇద్దరు వృద్ధులను గూగుల్‌ సెర్చ్‌ ద్వారా ఇళ్లకు చేర్చిన స్వచ్ఛంద సంస్థ

తమ ఇళ్ల నుండి తప్పిపోయిన ఇద్దరు సీనియర్ సిటిజన్‌లను మహారాష్ట్రలోని ఒక సంస్థ స్థానిక అధికారులను సంప్రదించడానికి గూగుల్ సెర్చ్‌ని ఉపయోగించి వారి కుటుంబాలతో తిరిగి కలిపేసింది. మానసిక వ్యాధితో బాధపడుతున్న మావ్‌జీభాయ్ వాఘ్రీ (70) పొరుగున ఉన్న గుజరాత్‌లోని వడోదర సమీపంలోని తన ఇంటి నుండి తప్పిపోయి సెప్టెంబర్ 14న పాల్ఘర్ జిల్లాలోని నల్లసోపరాలో కనుగొని ఆశ్రమంలో చేరాడు.

అణగారిన వ్యక్తులకు పునరావాసం కల్పించేందుకు పనిచేస్తున్న జీవన్ ఆనంద్ సంస్థ స్వచ్ఛంద సేవకులు, సిబ్బంది గూగుల్ సెర్చ్‌ని ఉపయోగించారు. వాఘ్రీ తన ప్రాంతం పేరును వారికి చెప్పగా, వారు అతని కుటుంబాన్ని కనుగొనడానికి అక్కడి స్థానిక పోలీసులను సంప్రదించినట్లు ఒక ప్రకటన పేర్కొంది. మరుసటి రోజు సెప్టెంబర్ 15న వాఘ్రీ తన కుటుంబంతో తిరిగి కలిశాడు.

అదేవిధంగా, నవీ ముంబయిలోని పన్వెల్‌లో తప్పిపోయిన 70 ఏళ్ల గిరిజన మహిళ పాడి గోమా భుక్రే కుటుంబ సభ్యులను కూడా ఈ సంస్థ గుర్తించగలిగిందని ఆ ప్రకటన తెలిపింది. భుక్రే పొరపాటున ముంబైకి బస్సు ఎక్కింది. అక్కడ ఆమె ప్రమాదంలో గాయపడింది. చికిత్స పొందిన తరువాత ఆమె సెప్టెంబర్ 14 రాత్రి సంస్థ యొక్క ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. భుక్రే గ్రామ సర్పంచ్‌ సంప్రదింపు సమాచారాన్ని పొందడానికి సంస్థ గూగుల్ సెర్చ్‌ను ఉపయోగించిందని, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని ఆ ప్రకటన తెలిపింది. ఇద్దరూ తప్పిపోయినట్లు వారి కుటుంబాలు నివేదించాయి. వాట్సాప్‌లో ప్రసారం చేయబడిన వారి ఫోటోలు కూడా వారిని గుర్తించడంలో సహాయపడ్డాయని పేర్కొంది.

Next Story