ఆస్పత్రిలో ఏసీ ఆన్ చేసిన డాక్టర్..ఇద్దరు శిశువులు మృతి

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఆస్పత్రిలో డాక్టర్‌ ఏసీ ఆన్‌ చేసుకోవడంతో ఇద్దరు శిశువులు ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on  25 Sept 2023 11:08 AM IST
Two Child, Dead, hospital, UP, AC,

ఆస్పత్రిలో ఏసీ ఆన్ చేసిన డాక్టర్..ఇద్దరు శిశువులు మృతి

ఆస్పత్రిలో చల్లదనాన్ని తట్టుకోలేక ఇద్దరు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో జరిగింది ఈ దుర్ఘటన. ఆస్పత్రిలో డాక్టర్‌ ఏసీ ఆన్‌ చేసుకోవడంతో ఇద్దరు శిశువులు ప్రాణాలు కోల్పోయారు.

అప్పుడే పుట్టిన పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యంగా ఉన్నట్లు అయితే మరింత అప్రమత్తత అవసరం. నిత్యం వారి ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ ఉండాలి. అయితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇద్దరు నవజాత శిశువులు డాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. షామ్లి జిల్లాలో ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లో డాక్టర్‌ నీతూ పని చేస్తోంది. శనివారం రోజున ఆమె నైట్‌ డ్యూటీ చేయాల్సి ఉంది. రాత్రి రౌండ్స్‌ పూర్తయ్యాక కాసేపు నిద్రపోదామని అనుకుంది. దాంతో.. నిద్రపోయే ముందు ఏసీ ఆన్‌చేసి పడుకుంది. ఏసీ చల్లదనం వల్ల ఇద్దరు శిశువులు చలికి తట్టుకోలేక పోయారు. చివరకు శ్వాస అందక ప్రాణాలు కోల్పోయారు. ఉదయం చూడటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు సదురు డాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ తర్వాత బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు శిశువుల మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు.. ఈ విషాదకర సంఘటనపై ఆరోగ్యశాఖ కూడా విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు దోషిగా తేలితే కఠిన చర్యలు తప్పవని అదనపు చీఫ్‌ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్వని శర్మ హెచ్చరించారు.

కాగా.. మృతిచెందిన శిశువులు శనివారం కైరానాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జన్మించారు. అదే రోజు ప్రైవేట్‌ క్లినిక్‌కు తరలించారు. అక్కడ చికిత్స కోసం వారిని ఫొటోథెరపీ యూనిట్‌కు తరలించారు. అక్కడ రాత్రి వైద్యుడు నీతూ ఏసీ ఆన్ చేసి రాత్రంతా నిద్రపోయాడు. ఉదయం చిన్నారులను చూసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు శిశువులు చనిపోయి ఉండటాన్ని గమనించారు. దాంతో.. డాక్టర్‌ నీతూపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.

Next Story