రాజ్యసభ చైర్మన్‌పై తృణమూల్ ఎంపీ వెకిలి ప్రదర్శన

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం అంశం ఉభయ సభల్లో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  19 Dec 2023 10:18 AM GMT
trinamool mp, imitate, rajya sabha chairman,

రాజ్యసభ చైర్మన్‌పై తృణమూల్ ఎంపీ వెకిలి ప్రదర్శన 

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం అంశం ఉభయ సభల్లో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. అయితే.. అలజడి సృష్టించిన అంశంపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళను చేశారు. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే విపక్ష ఎంపీలపై ఉభయ సభల్లో సస్పెన్షన్‌ వేటు పడింది. లోక్‌సభలో తాజాగా 49 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. దాంతో.. మొత్తం సస్పెండ్ అయినవారి సంఖ్య 142కి చేరింది. స్మోక్‌ అటాక్‌పై మోదీ, అఇత్‌సా ప్రకటన చేయాలని విపక్ష నాయకులంతా డిమాండ్ చేశారు.

సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పార్లమెంట్ బయట నిరసన ప్రదర్శన చేపట్టారు. అందులో భాగంగానే ఓ ఎంపీ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ను అనుకరిస్తూ విమర్శలు చేశారు. మకర ద్వారం వద్ద అనేక మంది ఎంపీల మధ్య కూర్చొన్న తృణమూల్‌ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. తనదైన స్టయిల్‌లో మాక్‌ పార్లమెంట్ నిర్వహించారు. అందరు ఎంపీల ముందు రాజ్యసభ చైర్మన్ జగదీప్‌ ధన్‌కర్‌ను మిమిక్రీ చేశారు. ఆ సమయంలో అక్కడే నిలబడి ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దీన్ని వీడియో తీశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. నా వెన్నుపూస నిటారుగా ఉంది, నేను చాలా పొడుగ్గా ఉన్నా అంటూ మిమిక్రీ ద్వారా తృణమూల్ ఎంపీ రాజ్యసభ చైర్మన్‌ను వెక్కిరించారు.

విపక్ష ఎంపీల వెకిలి ప్రదర్శనపై రాజ్యసభ చైర్మన్ జగదీప్‌ ధన్‌కర్‌ తప్పుబట్టారు. సస్పెండ్ అయిన ఎంపీల ప్రవర్తన ఆమోదయోగ్యంగా లేదని అన్నారు. ఇది అత్యంత సిగ్గుచేటు అని ధన్‌కర్ చెప్పారు. రాజ్యసభ చైర్మన్‌ను మిమిక్రీ చేయడం.. స్పీకర్‌ను అనుకరించడం దారుణమని ఆయన అన్నారు.


Next Story