ముందే వచ్చి..స్టేషన్‌లో 45 మందిని వదిలేసి వెళ్లిన రైలు
గోవా ఎక్స్‌ప్రెస్ 90 నిమిషాలు ముందుగానే వచ్చి ప్రయాణికుల్ని ఇబ్బందికి గురిచేసింది.
By - Srikanth Gundamalla |
ముందే వచ్చి..స్టేషన్‌లో 45 మందిని వదిలేసి వెళ్లిన రైలు
మామూలుగా రైల్వే స్టేషన్లకు రైళ్లు ఆలస్యంగా వస్తాయి. లేదంటే సమయానికి వచ్చి.. టైమ్‌కు వెళ్లిపోతుంటాయి. కానీ.. ఒక రైలు మాత్రం ఏకంగా 90 నిమిషాలు ముందు వచ్చి.. వెంటనే వెళ్లిపోయింది. దాంతో.. 45 మంది ప్రయాణికులు రైల్వేస్టేషన్‌లో ఉండిపోయారు. రైలు ముందే వెళ్లిపోయిందన్న విషయం తెలుసుకుని షాక్ అయ్యారు.
వాస్కోడగామా- హజ్రత్ నిజాముద్దీన్ గోవా ఎక్స్‌ప్రెస్ 90 నిమిషాలు ముందుగానే వచ్చి ప్రయాణికుల్ని ఇబ్బందికి గురిచేసింది. గురువారం ఉదయం 10.35 గంటలకు ఈ రైలు మహారాష్ట్రలోని మన్మాడ్ జంక్షన్‌కు రావాల్సి ఉంది. కానీ.. దారి మళ్లింపులో భాగంగా.. రైలు 9.05కే మన్మాడ్ జంక్షన్‌కు వచ్చేసింది. రైలు 10.35 గంటలకు కదా అని కొందరు ప్రయాణికులు టైమ్‌కు వెళ్దాం అనుకుని ఇంకా రాలేదు. కానీ.. ముందే వచ్చిన రైలు ఐదు నిమిషాలు మాత్రమే ఆగి ఆ తర్వాత వెళ్లిపోయింది. ఆ తర్వాత స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు రైలు కోసం వెయిట్ చేశారు. సమయం దాటినా రైలు రాకపోవడంతో అధికారులను ఆరా తీశారు. అయితే.. వారు రైలు ఇవాళ ముందుగానే వెళ్లిపోయింది అని చెప్పడంతో షాక్ అయ్యారు. ఆ తర్వాత 45 మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్‌లోనే ఉండిపోవడంతో ఆందోళనకు దిగారు.
తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ స్టేషన్ మేనేజర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. రైల్వే సిబ్బంది తప్పిదంగానే భావించిన రైల్వే అధికారులు 45 మంది ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ను మన్మాడ్‌లో నిలుపుదల చేసి.. దానిలో జల్గావ్‌కు పంపించారు. ఆ తర్వాత వారు వచ్చే వరకు గోవా ఎక్స్‌ప్రెస్‌ను అక్కడ నిలిపివేశారు. దాంతో.. చివరకు ప్రయాణికులు తమ ట్రైన్ ఎక్కరు. కాగా.. ఇదంతా సిబ్బంది పొరపాటు అని.. విచారణ చేస్తున్నామని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.