విషాదం.. ఆవును కాపాడబోయి ఒకే కుటుంబంలో నలుగురు మృతి
పశ్చిమ బెంగాల్‌లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 28 Sept 2024 4:21 PM ISTపశ్చిమ బెంగాల్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో పడ్డ ఆవును కాపాడబోయి.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.
బెంగాల్‌లోని జలపైగురి జిల్లాలో.. శుక్రవారం సయాత్రం టాకిమరి గ్రామానికి చెందిన 30 ఏళ్ల మిథున్ పొలం నుంచి ఆవును ఇంటికి తీసుకెళ్తున్నాడు. అయితే.. అనుకోకుండా షెడ్డు బయట నిలిచిన నీటిలో ఉన్న కరెంటు వైరు ఆవుకు తగిలింది. అంతే.. ఆవు విద్యుత్ ఘాతానికి గురైంది. ఆవును చూసిన అతను దాన్ని రక్షించే ప్రయత్నం చేశాడు. అతను ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. అప్పటికే మిథున్ అరుపులు విన్న 60 ఏళ్ల తండ్రి పరేశ్, తల్లి దీపాలి తమ కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నించారు. వారు కూడా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. అప్పటికే దీపాలి చేతుల్లో ఉన్న మిథున్ కుమారుడైన రెండేళ్ల బాలుడు సుమన్ కూడా ఈ సంఘటనలో విద్యుత్‌షాక్ కి గురై చనిపోయాడు. ఆ సమయంలో ఇంట్లో లేని వారి కోడలు ఈ దుర్ఘటన నుంచి తప్పించుకున్నది.
ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో నలుగురు చినిపోవడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.