ప్రధాని టూర్ తర్వాత లక్షద్వీప్‌పై పర్యాటకుల ఆసక్తి

లక్షద్వీప్‌లో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  8 Jan 2024 6:30 PM IST
Tourist, interest,  Lakshadweep,  modi tour,

ప్రధాని టూర్ తర్వాత లక్షద్వీప్‌పై పర్యాటకుల ఆసక్తి

లక్షద్వీప్‌లో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన టూర్‌ తర్వాత పర్యాటకులు అంతా లక్షదీప్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. వీటి కోసం ఆన్‌లైన్‌లో తెగ వెతికేస్తున్నారు. అక్కడ ఎలాంటి వ్యూ అందుబాటులో ఉంటుంది.. అలాగే.. ఏఏ ప్రదేశాలు బాగుంటాయి.. ప్యాకేజీ ఎంత ఇలా అన్నీ సెర్చ్‌ చేస్తున్నారు. ఈ మేరకు మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్‌ దీవుల గురించి ఆన్‌లైన్‌లో వెతికిన వారి సంఖ్య ఇరవై ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరిందని కేంద్ర ప్రభుత్వం సమాచార విభాగాలు తెలిపాయి. మరోవైపు తమ వెబ్‌సైట్‌లో లక్షద్వీప్‌ కోసం వెతుకుతున్నవారి సంఖ్య భారీగా పెరిగిందనీ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థ మేక్‌మై ట్రిప్‌ తెలిపింది.

కాగా.. ప్రధాని నరేంద్ర మోదీ జనవరి మొదటి వారంలో లక్షద్వీప్‌లో పర్యటించారు. కవరత్తి దీవిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అంతేకాదు.. మరికొన్ని ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత బీచ్‌లో ప్రధాని మోదీ సేదతీరుతూ ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. లక్షద్వీప్‌లో బీచ్‌లు, ఆతిథ్యం అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. సాహసాలు చేయాలనుకునేవారు తప్పకుండా లక్షద్వీప్‌ను ఎంచుకోవాలన్నారు. ఆ తర్వాత లక్షద్వీప్‌ కోసం వెతికేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కేవలం శుక్రవారం ఒక్కరోజే 50వేల మంది గూగుల్‌లో వెతికినట్లు తెలిసింది.

మరోవైపు మేక్‌మై ట్రిప్‌ లక్షద్వీప్‌ కోసం వెతికేవారి సంఖ్య భారీగా పెరిగిందని ఎక్స్‌ వేదికగా తెలిపింది. భారత దీవుల కోసం వెతికేవారి సంఖ్య 3400 శాతం పెరిగినట్లు వెల్లడించింది. భారతీయ పర్యాటకులు ఇండియన్‌ బీచ్‌లపై చూపిస్తోన్న ఆసక్తి, కొత్త కార్యక్రమాలు రూపొందించేందుకు స్ఫూర్తినిచ్చిందని ఆ సంస్థ తెలిపింది. అద్భుతమైన బీచ్‌లను అన్వేషించేలా భారత పర్యాటకులను ప్రోత్సహించేందుకు సరికొత్త ఆఫర్లు, డిస్కౌట్లను త్వరలోనే అందిస్తామని మేక్‌మై ట్రిప్‌ సంస్థ ఎక్స్‌ వేదికగా తెలిపింది.

లక్షద్వీప్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రధాని మోదీ చెప్పిన తర్వాత.. మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. లక్షద్వీప్‌లో పరిశుభ్రతను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు. దాంతో.. భారత పర్యాకుటుల వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మాల్దీవులకు మేక్‌మై ట్రిప్‌ టూర్ బుకింగ్స్‌ను క్యాన్సిల్ చేయాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. అయితే.. మాల్దీవ్స్‌ గవర్నమెంట్‌ దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను పదవుల నుంచి తొలగించింది. మరోవైపు ఈ కామెంట్స్‌పై పలువురు సినీ, క్రీడారంగ ప్రముఖులు స్పందిస్తున్నారు. మాల్దీవులకు బదులు భారత్‌లో ఉన్న దీవులను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.

Next Story