మద్యం మత్తులో యువతుల వీరంగం.. ఏకంగా పోలీసులతోనే...

మద్యం సేవించిన వారు ఎప్పుడేం చేస్తారో అర్థం కాదు.

By Srikanth Gundamalla  Published on  10 May 2024 12:15 PM IST
three ladies, drunk, fight,  police,  Mumbai ,

 మద్యం మత్తులో యువతుల వీరంగం.. ఏకంగా పోలీసులతోనే... 

మద్యం సేవించిన వారు ఎప్పుడేం చేస్తారో అర్థం కాదు. తమనెవరు అడ్డుకునేది అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. నిబంధనల ప్రకారం డ్రంక్‌ అండ్ డ్రైవ్ చేయొద్దని చెప్పినా కొందరు వినిపించుకోరు. అలాగే చేస్తూ ప్రమాదాలకు గురవుతుంటారు. ఎదుటి వారికి హాని కలిగిస్తుంటారు. ఇంకొన్ని సందర్భాల్లో ఇతరులతో గొడవపెట్టుకుని నానా హంగామా చేస్తుంటారు. తాజాగా మహారాష్ట్రలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అయితే.. వీరంగం చేసింది అమ్మాయిలు కావడంతో దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

మహారాష్ట్ర ముంబై దగ్గర ఉన్న విరార్‌ ప్రాంతంలో అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. గోకుల్ టౌన్‌షిప్‌లోని రెస్టారెంట్ బార్‌లో మద్యం సేవించారు ముగ్గురు అమ్మాయిలు. ఆ తర్వాత వారికి మద్యం ఎక్కువ అవ్వడంతో రచ్చ చేయడం ప్రారంభించారు. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ.. ఇతర కస్టమర్లకు ఇబ్బంది కలిగించడం ప్రారంభించారు. దాంతో.. సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. రెస్టారెంట్ బార్‌ బయటకు వచ్చాక ఆ ముగ్గురు మహిళలు మరింత రెచ్చిపోయి ప్రవర్తించారు.

పోలీసులు సుదురు ముగ్గురు యువతులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దానికి వారు వినకపోగా తిరిగి పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా పోలీసులను దుర్భాషలాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు. ఓ యువతి ఏకంగా మహిళా కానిస్టేబుల్‌ చేతిని కొరికి గాయపరించింది. మరో యువతి అక్కడే ఉన్న ఎన్‌స్పెక్టర్‌ చొక్కాను పట్టుకుని నానా హంగామా చేసింది. వదిలించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఆమె వినలేదు. పోలీసులు అతికష్టం మీద ఆ ముగ్గురిని నియంత్రించి చిరవకు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించి పబ్లిక్‌ ప్లేస్‌లో న్యూసెన్స్ చేసినందుకు ఐపీసీ సెక్షన్ 353, 323, 325, 504, 506 కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతూ ఆ ముగ్గురు యువతులను తిడుతున్నారు.

Next Story