జైల్లో పెట్టండి ఇంటికి మాత్రం వెళ్లను.. భార్య వేధింపులతో పారిపోయిన టెకీ
భార్య వేధింపులు తాళలేక ఓ భర్త ఇల్లు వదిలి పారిపోయాడు.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 9:48 AM ISTజైల్లో పెట్టండి ఇంటికి మాత్రం వెళ్లను.. భార్య వేధింపులతో పారిపోయిన టెకీ
భార్యభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. దాదాపు అందరూ సర్దుకుపోయి దాంపత్య జీవితాన్ని ముందుకు సాగిస్తుంటారు. కొందరు మాత్రం కోర్టు మెట్లు భాగస్వామితో విడాకులు కోరుకుని విడిపోతూ ఉంటారు. అయితే.. తాజాగా భార్య వేధింపులు తాళలేక ఓ భర్త ఇల్లు వదిలి పారిపోయాడు. భార్య కంప్లైంట్ తో పట్టుకున్న పోలీసులు.. అతడు చెప్పిన విషయాలను విని ఆశ్చర్యపోయారు. కర్ణాటకలోని బెంగళూరులో ఈ సంఘటన చోటుచేసుకుంది.
విపిన్ గుప్తా (34) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బెంగళూరులోని మాన్యత టెక్ పార్క్‌లో ఓ ప్రముఖ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతడికి భార్య శ్రీపర్ణ (42), ఇద్దరు పిల్లలు ఉన్నారు. బెంగళూరులోని కొడిగేహళ్లిలో ఈ దంపతులు నివాసం ఉంటున్నారు. భార్య తరచూ విపిన్ గుప్తాతో గొడవ పడేది. మానసిక వేదనకు గురైన విపిన్ ఒక రోజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. భార్యతో ఆఫీసు పనిపైన వెళ్తున్న అని చెప్పాడు. అయితే.. వారం రోజులు అయినా భర్త ఇంటికి తిరిగి రాకపోవడం.. ఫోన్ అందుబాటులో లేకపోవడంతో భార్య పోలీసులను ఆశ్రయించింది. మరోవైపు బ్యాంకు నుంచి ఒకేసారి లక్ష రూపాయలకు పైగా విత్ డ్రా చేయడంతో అనుమానం వచ్చింది. ఈ నెల 6న కొడిగేహళ్లి పోలీసులను ఆశ్రయించింది శ్రీపర్ణ. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. ముందు విచారణలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని సదురు మహిళ ఏకంగా ఎక్స్‌లో ప్రధానిని ట్యాగ్ చేసింది.
దాంతో.. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు విపిన్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి బెంగళూరుకు తీసుకొచ్చారు. అతన్ని విచారించిన పోలీసులు విపిన్ మాటలను విని ఆశ్చర్యపోయారు. భార్య పెట్టే హింసను భరించలేకపోతున్నానని వాపోయాడు. అందుకే ఇంటి నుంచి పారిపోయానని చెప్పాడు. ఏ కేసు అయినా సరే పెట్టి.. అవసరమైతే జైలుకు పంపండ అంటూ బాధపడ్డాడు. జైలుకైనా వెళ్తా కానీ.. ఇంటికి మాత్రం వెళ్లనని అన్నాడు. విపిన్‌ను సముదాయించే ప్రయత్నం చేశారు పోలీసులు.