Tamil Nadu: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమోట్

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది.

By Srikanth Gundamalla
Published on : 29 Sept 2024 5:07 PM IST

Tamil Nadu: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమోట్

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్‌ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ప్రమోట్‌ అయ్యారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మనీలాండరింగ్‌ కేసులో మాజీ మంత్రి సెంథిల్ బాలజీ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన వారిలో సెంథిల్ బాలాజీ కూడా ఉన్నారు.

మరో ముగ్గురు గోవి చెళియన్‌, ఎస్‌ఎం నాజర్‌, ఆర్‌.రాజేంద్రన్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సెంథిల్‌కు విద్యుత్‌, ఎక్సైజ్‌ శాఖ, చెళియన్‌కు విద్యాశాఖ, నాజర్‌కు మైనార్టీ వ్యవహారాలు బాధ్యతలను అప్పగించారు సీఎం స్టాలిన్. అలాగే రాజేంద్రన్‌కు పర్యటక శాఖలను కేటాయించారు. మంత్రి వర్గ పునర్‌వ్యవ్థీకరణ సాధారణమే కానీ.. ఈసారి ఉదయనిధికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించడంతో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న ఉదయనిధి తాగాజా డిప్యూటీ సీఎంగా ప్రమోట్ అయ్యారు. ఆదివారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇక మళ్లీ ఆయన మళ్లీ ప్రమాణం అయితే చేయలేదు. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి బయలుదేరేముందు మీడియాతో మాట్లాడిన ఆయన ... ఉపముఖ్యమంత్రి అనేది తనకు అది పదవి కాదని, ఓ పెద్ద బాధ్యతని పేర్కొన్నారు. ఇక ఉదయనిధి స్టాలిన్‌ డిప్యూటీ సీఎంగా బాద్యతలు తీసుకోవడంపై ఇతర పక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.

Next Story