ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ఎంపీ, ఆత్మహత్యాయత్నమేనా?

తమిళనాడులో ఓ ఎంపీని హఠాత్తుగా ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.

By Srikanth Gundamalla  Published on  25 March 2024 10:42 AM IST
tamil nadu, mp ganesamoorthy, hospital,

ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ఎంపీ, ఆత్మహత్యాయత్నమేనా?

తమిళనాడులో ఓ ఎంపీని హఠాత్తుగా ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఇక ఈ సంఘటనపై పలు వదంతులు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో, తమిళనాడులో సంచలనంగా మారింది.

తమిళనాడులోని ఈరోడ్‌ ఎంపీ గణేశమూర్తి ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించడంతో ఆయన్ని కోవైలోని ప్రయివేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అయితే.. గణేశమూర్తి ఆత్మహత్యాయత్నం చేశారనీ.. అందుకే ఆయన్ని కుటుంబ సభ్యులు హఠాత్తుగా ఆస్పత్రిలో చేర్పించారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. గణేశమూర్తి 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఎండీఎంకేకు ఈరోడ్‌ స్థానం కేటాయించగా.. గణేశమూర్తి ఉదయించే సూర్యుడి గుర్తుపై గెలిచారు. ఇక రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎండీఎంకేకు తిరుచ్చి కేటాయించగా దురైవైగోను అభ్యర్థిగా ప్రకటించారు. గణేశమూర్తికి మరోసారి అవకాశం దక్కలేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వారం రోజులుగా ఆయన మనోవేదనకు గురై ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ నేపథ్యంలోనే గణేశమూర్తి ఈరోడ్‌లోని ప్రయివేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఆయన్ని కోవైలోని ప్రయివేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. మరోవైపు ఆయన్ని ఎందుకు ఆస్పత్రిలో చేర్పించారు అనేదానిపై స్పష్టత లేదు. కొందరు మాత్రం పార్టీలో సమస్యల కారణంగా గణేశమూర్తి ఆత్మహత్య యత్నం చేశారని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ వర్గీయులు కూడా నిర్ధారించలేదు.

Next Story