మథురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.

By Srikanth Gundamalla  Published on  16 Jan 2024 6:48 AM
Supreme Court,   Sri Krishna Janmabhoomi,  Mathura,

మథురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు 

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయం చెంతననున్న షాహీ ఈద్గాలో శాస్త్రీ సర్వేకు అత్యున్నత న్యాయస్థానం బ్రేక్‌ వేసింది. ఈ క్రమంలో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని హిందూ సంఘాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

మథురలో శ్రీకృష్ణుడు జన్మించిన స్థలంలో షాహీ ఈద్గా నిర్మించారనీ.. దీనిపై సర్వే చేయించాలంటూ జిల్లా కోర్టులో గతంలో 9 పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే.. ఈ పిటిషన్లు చాలా కాలంపాటు పెండింగ్‌లో ఉండిపోయాయి. దాంతో.. వాటిని మథుర జిల్లా కోర్టు నుంచి అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ పిటిషన్లపై గతేడాది డిసెంబర్‌లో విచారణ చేపట్టిన హైకోర్టు.. న్యాయస్థానం పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. దాని పర్యవేక్షణకు గాను అడ్వొకేట్‌ కమిషనర్‌ను నియమించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కాగా.. అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై ముస్లిం కమిటీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఇక వారి పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పును వెలువరించింది. ముస్లింల కమిటి పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం విచారించింది. ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశాల అమలుపై స్టే ఇచ్చింది. హిందూ సంఘాలకు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ వివాదంపై హైకోర్టు ఎదుట విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

Next Story