కావడి యాత్ర వివాదానికి సుప్రీంకోర్టు తెర.. కీలక ఆదేశాలు జారీ

ఉత్తర రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారిన కావడి యాత్రపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

By Srikanth Gundamalla  Published on  23 July 2024 2:44 AM GMT
supreme court, stay,  kawad yatra issue,

కావడి యాత్ర వివాదానికి సుప్రీంకోర్టు తెర.. కీలక ఆదేశాలు జారీ

ఉత్తర రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారిన కావడి యాత్రపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది. కావడి యాత్ర వివాదానికి తెర దించే దిశగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులను జారీ చేసింది. భక్తులు వెళ్లే మార్గాల్లో దుకాణాలు, హోటళ్ల ముందు యజమానులు, సిబ్బంది పేర్లతో బోర్డులు ప్రదర్శించాలన్న ఉత్తర్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశాలపై న్యాయస్థానం స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. బదులుగా లభించేది శాఖాహరమో, మాంసాహారమో తెలిపే బోర్డులు ప్రదర్శిస్తే సరిపోతుందని స్పష్టం తెలిపింది సుప్రీంకోర్టు.

శ్రావణమాసంలో గంగాజలాన్ని కావడిలో సేకరించి భక్తులు తిరిగి తమ సొంతూరిలోని శివాలయాల్లో జలాభిషేకం చేస్తారు. పుణ్యజలాలను తీసుకెళ్లే భక్తులకు శాకాహారం అందించే హోటళ్ల వివరాలు తెలియాలనే ఉద్దేశంతో ఆయా రాష్ట్రాలు ఉత్తర్వులు ఇచ్చాయి. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. తాను కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా ముస్లింలు నడిపే శాకాహార భోజనంలోనే తినేవాడినని జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి ఈ సందర్భంగా చెప్పారు. యూపీ, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాల తరఫున ఎవరూ హాజరు కాకపోవడంతో విచారణను శుక్రవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

Next Story