కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షాక్.. బెయిల్‌ పొడిగింపు పిటిషన్ తిరస్కరణ

కేజ్రీవాల్‌ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

By Srikanth Gundamalla
Published on : 29 May 2024 12:45 PM IST

supreme court,  delhi cm Kejriwal, bail extension petition,

 కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షాక్.. బెయిల్‌ పొడిగింపు పిటిషన్ తిరస్కరణ

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఆప్‌ జాతీయ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్‌ను గతంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసుకునేందుకు కేజ్రీవాల్‌కు కోర్టు మధ్యంతర బెయిల్‌ను ఇచ్చింది. ఇక తన అనారోగ్యం దృష్ట్యా ఆ బెయిల్‌ను ఏడు రోజుల పొడిగించాలని సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌ పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం సీఎం కేజ్రీవాల్‌కు భారీ షాక్‌ ఇచ్చింది.

కేజ్రీవాల్‌ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరపబోము అని బుధవారం స్పష్టం చేసింది. రెగ్యులర్ బెయిల్‌ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్‌కు ఇప్పటికే అవకాశం ఇచ్చినందున ఈ పిటిషన్‌ను విచారించడం సాధ్యం కాదని కోర్టు రిజిస్ట్రీ తెలిపింది. కాగా.. అంతకుముందు కేజ్రీవాల్‌ చేసిన అభ్యర్థనను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. పిటిషన్‌ ఎప్పుడు విచారించాలన్న అంశంపై సీజేఐ చంద్రచూడ్‌ నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ మంగళవారం వెల్లడించింది. ఈ పిటిషన్‌ను మధ్యంతర బెయిల్‌ను విచారిస్తున్న బెంచ్‌ ఉన్నప్పుడు గతవారమే ఎందుకు దాఖలు చేయలేదని కోర్టు ప్రశ్నించింది.

కాగా.. లిక్కర్‌ పాలసీ కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టను ఆశ్రయించారు. ఇక ప్రచారం కోసం మే 10న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 1వ తేదీ వరకు బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా బెయిల్‌ ను పొడిగించాలన్న కేజ్రీవాల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో.. జూన్ 2న ఆయన మరోసారి జైలుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి.

Next Story