క్షమాపణల్లేవ్.. చర్యలకు పతంజలి యాజమాన్యం రెడీగా ఉండాలన్న సుప్రీంకోర్టు
పతంజలి ఆయుర్వేద సంస్థకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మరోసారి ఆ సంస్థపై దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 10 April 2024 9:30 AM GMTక్షమాపణల్లేవ్.. చర్యలకు పతంజలి యాజమాన్యం రెడీగా ఉండాలన్న సుప్రీంకోర్టు
పతంజలి ఆయుర్వేద సంస్థకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మరోసారి ఆ సంస్థపై దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌బాబా, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై చర్యలు తీసుకోబడతాయనీ.. అందుకు సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అయితే.. ఈ కేసులో వారి క్షమాపణలు అంగీకరించబోము అని స్పష్టం చేసింది. ఇద్దరూ సమర్పించిన ప్రాణ పత్రాలను సుప్రీంకోర్టు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం విచారించి ఈ వ్యాఖ్యలు చేసింది.
పతంజలి ధిక్కర కేసుపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తులు. ఈ కేసులో తాము ఉదారంగా వ్యవహరించలేమని స్పష్టంగా చెప్పారు. కోర్టు పట్ల అలక్ష్యంగా వ్యవహరించారని సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అలాగే వారిద్దరి క్షమాపణల పట్ల తామెందుకు అలక్ష్యంగా వ్యవహరించొద్దని ప్రశ్నించారు. అంతేకాదు.. రాందేవ్‌బాబా, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ క్షమాపణలపై తమకు నమ్మకం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే దాన్ని తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు క్షమాపణలు చెప్పడానికి ముందే రాందేవ్ బాబా, బాలకృష్‌ణ ఇద్దరూ తమ అఫిడవిట్లను మీడియాకు పంపించారని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఇక తమ వద్దకు మంగళవారం రాత్రి 7.30 గంటలు దాటినా అందలేదని చెప్పింది. వీరిరువురూ ప్రచారం కోరుకుంటున్నారని అర్థమైందంటూ సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది.
కేవలం ఇది ఒక ఎఫ్‌ఎంసీజీ కంపెనీకి సంబంధించిన వ్యవహారం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందనేది సమాజంలోకి వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపింది. తప్పుదోవ ప్రట్టించే ప్రకటనల విషయంలో చర్యలు తీసుకోనందుకు ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటిని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం మందలించింది. పదేపదే ఉల్లంఘనలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం ఏంటని నిలదీసింది. కాగా.. లైసెన్సింగ్ అథారిటీలో ఉన్న ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.