సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి కన్నుమూత
సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన జస్టిస్ ఫాతిమా బీవీ అనారోగ్యంతో కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 23 Nov 2023 3:12 PM ISTసుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి కన్నుమూత
కేరళలో విషాదం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన జస్టిస్ ఫాతిమా బీవీ అనారోగ్యంతో కన్నుమూశారు. జస్టిస్ ఫాతిమా బీవీ (96) అనారోగ్యంగా ఉండటంతో.. కేరళలోని కొల్లాంలో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అయితే.. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డు సృష్టించిన జస్టిస్ ఫాతిమా.. గతంలో తమిళనాడు గవర్నర్‌గా కూడా పని చేశారు. జస్టిస్ ఫాతిమా మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
జస్టిస్ ఫాతిమా మరణంపై మాట్లాడిన కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఫాతిమ నియమించబడటం సంతోషకరమని చెప్పారు. ఆమె గవర్నర్‌గా కూడా పనిచేసి ప్రజలకు సేవలందించారని పేర్కొన్నారు. జస్టిస్ ఫాతిమా సేవలను కొనియాడారు కేరళ మంత్రి వీణా జార్జ్.
జస్టిస్ ఫాతమిమా కేరళలోని పతనంతిట్టలో 1927 ఏప్రిల్ 30న జన్మించారు. తండ్రి ప్రోత్సాహంతోనే ఆమె న్యాయవాద విద్యను అభ్యసించారు. 1950లో కేరళ బార్ కౌన్సిల్ పరీక్షలో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ మెడల్ సాధించిన తొలి మహిళగా కూడా ఆమె రికార్డు నెలకొల్పారు. ఆ తర్వాత 1974లో జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 1980లో ఇన్‌కమ్‌ట్యాక్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్‌లో జ్యుడిషయల్ సభ్యురాలిగా కూడా కొనసాగారు జస్టిస్ ఫాతిమా. ఆమె 1989 అక్టోబరు 6 నుంచి 1992 ఏప్రిల్ 29వ తేదీ వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత 1997లో జస్టిస్ ఫాతిమా తమిళనాడు గవర్నర్‌గా కూడా పనిచేశారు.