దేశవ్యాప్తంగా ఉన్న పోలీసులు అనుసరిస్తున్న దర్యాప్తు విధానాలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. చాలా కేసుల్లో సాంకేతిక కారణాలతోనే దోషులు తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది న్యాయస్థానం. అయితే.. దర్యాప్తు ఎలా చేయాలనే దానిపై విచారణ చేసే అధికారులకు ఒక స్థిరమైన, విశ్వసనీయమైన నియమావళిని రూపొందించాల్సిన తరుణం ఆసన్నమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓ కేసులో మరణశిక్ష, యావజ్జీవం పడిన నిందితులను సాంకేతిక కారణాలతోనే సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ సంజయ్ కుమార్‌ల త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
అయితే.. దోషులు సాంకేతిక కారణాలతో తప్పించుకుంటున్నారని.. అంతేకాదు చాలా కేసుల్లో ఇలానే జరుగుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మరో కేసులో దీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించిన ఖైదీలకు ముందస్తు విడుదల అవకాశాన్ని నిరాకరించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సత్ప్రవర్తనతో ఉన్న ఖైదీలకు క్షమాభిక్షను దూరం చేయడం ఏమాత్రం సబబు కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 26 ఏళ్లుగా కస్టడీలో ఉన్న ఓ 67 ఏళ్ల ఖైదీ విడుదలకు ఉత్తర్వులను జారీ చేస్తూ సర్వోత్తర న్యాయస్థానం ఈ విధంగా చెప్పింది. మంచి ప్రవర్తనతో ఉన్నవారికి మరోసారి బాగా జీవించే అవకావం కల్పించడం సరైన నిర్ణయమే అని పేర్కొంది.