కొద్దిరోజుల కిందట కోతులు వర్సెస్ కుక్కలకు సంబంధించిన వార్తలను తెగ చదువుకున్నాం. ఇప్పుడు గొర్రెల మందపై పడి వాటిని చంపుతున్న కుక్కల గురించి తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. ఈ ఘటనకు సంబంధించిన లొకేషన్ జమ్మూ కశ్మీర్ గా నిలిచింది.
జమ్మూ కశ్మీర్ లోని గందర్‌బల్ జిల్లాలో బుధవారం- గురువారం మధ్య రాత్రి రెండు వీధికుక్కల దాడిలో 18 గొర్రెలు చనిపోయాయి. డజనుకు పైగా గాయపడ్డాయి. గండేర్బల్ జిల్లా వాట్లర్ గ్రామంలోని అబ్దుల్ గని భట్ గోశాలలోకి రాత్రి కుక్కలు చొరబడి 14 గొర్రెలను చంపేశాయని స్థానికులు తెలిపారు. రాత్రిపూట జరిగిన ఈ దాడిలో మరో డజనుకు పైగా గాయపడ్డాయి. కుక్కలు దాడి చేసే సమయంలో షెడ్డులో దాదాపు 30 గొర్రెలు ఉన్నాయి. "ఈ గ్రామంలోని గులాం ఖాదిర్ అనే వ్యక్తికి చెందిన మరో గోశాలపై కుక్కలు దాడి చేసి 4 గొర్రెలను చంపివేసి, 3 గొర్రె పిల్లలను గాయపరిచాయి" అని స్థానికులు తెలిపారు. ఏళ్ల తరబడి విపరీతంగా పెరిగిపోతున్న వీధికుక్కల బెడదను అరికట్టేందుకు మున్సిపల్ కమిటీ గందర్‌బల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు.
మహిళలు, పిల్లలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారని స్థానికులు తెలిపారు. ఈ నెల మొదటి వారంలో ఇదే జిల్లాలోని గుండు ప్రాంతంలో పట్టపగలు గొర్రెల మందపై వీధికుక్కలు దాడి చేసి 10 గొర్రెలను చంపేశాయి.