కరోనా కాలంలో నిరుపేదల కోసం సోనూ సూద్ నిజ జీవితంలో హీరోగా మారిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి సమయంలో లాక్ డౌన్ కారణంగా చాలా మందికి వారి ప్రయాణ సౌకర్యాలను అందించడం, వైద్య బిల్లులు చెల్లించడం వరకు సహాయం చేసాడు.
ఇప్పుడు మరో గొప్ప పనికి సోనూ సూద్ శ్రీకారం చుట్టారు. సోనూ అతని సోదరి మాళవికా సూద్ సచార్ మంగళవారం మోగాలో 1000 సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ సైకిళ్లను మోగాలోని ప్రభుత్వ పాఠశాల బాలికలకు, సామాజిక కార్యకర్తలకు పంపిణీ చేయనున్నారు. మోగా సమీపంలోని దాదాపు 40-45 గ్రామాలకు చెందిన విద్యార్థులు ఈ సైకిళ్ల ద్వారా ప్రయోజనం పొందుతారు
సోనూ సూద్ మాట్లాడుతూ, "పాఠశాల ఇంటికి మధ్య దూరం చాలా ఎక్కువ, తీవ్రమైన చలిలో తరగతులకు హాజరు కావడానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సమస్యను అరికట్టడంలో వారికి సహాయపడటానికి, మేము 8వ తరగతి నుండి 12వ తరగతి వరకూ అర్హులైన బాలికలకు సైకిళ్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. మేము ఈ సైకిళ్లను సామాజిక కార్యకర్తలకు కూడా అందిస్తాము." అని చెప్పుకొచ్చాడు.
సోనూ సూద్ ప్రస్తుతం బాలీవుడ్ లో 'పృథ్వీరాజ్' సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు. అక్షయ్ కుమార్, మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లార్ ఈ సినిమాలో నటించారు. అయితే ఓమిక్రాన్ వ్యాప్తి కారణంగా ఈ చిత్రం విడుదల తేదీ వాయిదా పడింది. టాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో సోనూ సూద్ నటిస్తూ ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా సోనూ సూద్ ఉన్నాడు.